నితీశ్‌కు దిగ్విజయ్‌ సూచనిదే..!

బిహార్‌లో వెలువడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనుద్దేశించి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. దివంగత నేత, లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) వ్యవస్థాపకుడు రామ్‌ విలాస్‌ పాస్వాన్‌ వారసత్వాన్ని..........

Published : 12 Nov 2020 01:17 IST

బిహార్‌ ఫలితాల నేపథ్యంలో భాజపాపై కాంగ్రెస్‌ నేత తీవ్ర విమర్శలు

పట్నా: బిహార్‌లో వెలువడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనుద్దేశించి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. దివంగత నేత, లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) వ్యవస్థాపకుడు రామ్‌ విలాస్‌ పాసవాన్‌ వారసత్వాన్ని భాజపా నాశనం చేసిందని ఆరోపించారు. భాజపా మిత్రపక్షమైన జేడీయూ అధినేత, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ప్రతిష్ఠతను దిగజార్చిందని వ్యాఖ్యానించారు.

బిహార్‌లో 125 స్థానాలు కైవసం చేసుకొని ఎన్డీయే అధికారాన్ని నిలుపుకొన్న విషయం తెలిసిందే. మరోవైపు రామ్‌ విలాస్‌ తనయుడు చిరాగ్‌ నేతృత్వంలోని ఎల్జేపీ 137 స్థానాల్లో బరిలోకి దిగి కేవలం ఒక్క స్థానంలోనే గెలుపొందింది. అలాగే, గతంతో పోలిస్తే జేడీయూ సీట్లకు సైతం గండిపడింది. 

ఈ నేపథ్యంలో బిహార్‌ను వదిలి కేంద్ర రాజకీయాల్లోకి రావాలని నితీశ్‌కు దిగ్విజయ్‌ సింగ్‌ హితవు పలికారు. ‘‘నితీశ్‌జీ.. మీకు బిహార్ చాలా చిన్నది. మీరు జాతీయ రాజకీయాల్లోకి రావాలి. విభజించు.. పాలించు.. అన్న కేంద్ర ప్రభుత్వ సిద్ధాంతాన్ని ముందుకు సాగనివ్వొద్దు. సామ్యవాదులంతా లౌకిక సిద్ధాంతానికి కట్టుబడి ఉండేందుకు సహకరించండి. ఈ సూచనను పరిగణనలోకి తీసుకోండి’’ అని దిగ్విజయ్‌ పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను దిగ్విజయ్‌ అభినందించారు. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ప్రశంసలు కురిపించారు. దేశంలో సిద్ధాంతం కోసం పనిచేస్తున్న ఏకైక నేత రాహుల్‌ గాంధీయేనని వ్యాఖ్యానించారు. సిద్ధాంతాల్ని విస్మరించి.. స్వార్థ ప్రయోజనాల కోసం పోరాడే వారు రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఉండలేరన్నారు.  

ఎన్డీయే నుంచి వైదొలగి చిరాగ్‌ పాసవాన్‌  ఒంటరిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిర్ణయం వెనుక భాజపా పెద్దల వ్యూహం ఉందని ముందు నుంచీ వినిపిస్తోంది. తద్వారా జేడీయూ సీట్లకు గండికొట్టాలని భావించారని రాజకీయ విశ్లేషకుల వాదన. అందుకనుగుణంగానే ఎల్జేపీకి కేవలం 5.6 శాతం ఓట్లే వచ్చినా.. జేడీయూకి మాత్రం సీట్లపరంగా గండికొట్టగలిగిందని అర్థమవుతోంది. జేడీయూ అభ్యర్థులు బరిలోకి దిగిన ప్రతిచోటా ఎల్‌జేపీ తన అభ్యర్థుల్ని నిలబెట్టి ఓట్లు చీల్చిందన్నది విశ్లేషణ. 

ఇవీ చదవండి..
బిహార్‌ కిక్కు.. ఏ పార్టీకి ఎంత..?

196 నుంచి 19కి తగ్గిన కాంగ్రెస్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని