తృణమూల్‌లో పెరుగుతోన్న అసమ్మతి..!

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Published : 17 Dec 2020 01:25 IST

దీదీకి తలనొప్పిగా మారిన తాజా పరిణామాలు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. అక్కడ పాగా వేసేందుకు భాజపా ఇప్పటికే వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో తృణమూల్‌ అధినేతకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.  టీఎంసీ కీలక నేత సువెందు అధికారి పార్టీని వీడి భాజపాలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇది మరువక ముందే పార్టీలో అసమ్మతి నేతలు తమ స్వరాన్ని పెంచారు. తాజాగా పార్టీ సీనియర్‌ ఎంపీ సునీల్‌ మండల్‌తో పాటు మరో కీలక నేత జితేంద్ర తివారీ, సువెందుకు మద్దతుగా నిలబడ్డారు. సంస్థాగత సమస్యలను పార్టీ నాయకత్వం సకాలంలో పరిష్కరించడం లేకపోవడంవల్లే ఇటువంటి సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో ఈ తాజా పరిణామాలు దీదీకి తలనొప్పిగా మారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

బర్దమాన్‌ పుర్బా లోక్‌సభ స్థానం నుంచి రెండు సార్లు గెలుపొందిన సునీల్‌ మండల్‌ తృణమూల్‌ రెబల్‌నేతకు మద్దతుగా బహింరంగంగా మాట్లాడటం పార్టీలో కలవరం రేపింది. పార్టీలో నెలకొన్న అంతర్గత పోరు, అవినీతిని నియంత్రించడంలో పార్టీ నాయకత్వం సరైన విధంగా స్పందించడంలేదని సునీల్‌ ఆరోపించారు. ‘సువెందు అధికారి మంచి నేత, అంతేకాకుండా బలమైన మాస్‌ బేస్‌ ఉన్న వ్యక్తి. ఆయన పార్టీని వీడటం ఎన్నికల్లో తృణమూల్‌కు తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పార్టీలో ఎన్నో సమస్యలున్నప్పటికీ వాటిని పరిష్కరించడంలో నాయకత్వం విఫలమయ్యింది. పాతవారితో కలిసి కొత్తవారు కలిసి పనిచేయాలని పార్టీ నాయకత్వం సూచిస్తోంది. కానీ, అది సాధ్యమయ్యే పనికాదు’ అని సునీల్‌ మండల్‌ పేర్కొన్నారు. అయితే, సువెందును కలుస్తారనే ఊహాగానాలపై మండల్‌ను మీడియా ప్రశ్నించగా.. సువెందు అధికారికి నాకు ఎన్నో ఏళ్లనుంచి పరిచయం ఉందని సునీల్‌ మండల్‌ జవాబిచ్చారు.

ఇక, మరో కీలక నేత జితేంద్ర తివారీ కూడా గతకొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. తమ ప్రాంతానికి వచ్చిన కేంద్ర నిధులను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. పార్టీ అంతర్గత విబేధాలపై ప్రశ్నించిన వారిని పార్టీనుంచి వెళ్లిపోవాలని అధికారపార్టీ మంత్రులే సూచిస్తున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాకుండా తృణమూల్‌లో మమతా బెనర్జీ తర్వాత అత్యంత ముఖ్యమైన మాస్‌ లీడర్‌ సువెందు అధికారి అని ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. బర్దమాన్‌ పుర్బాలో జరిగిన ర్యాలీలో ఈ విధంగా స్పందించిన తివారీ, పార్టీ తరపున ఇదే చివరి ప్రచారం కావచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో జితేంద్ర తివారీ కూడా పార్టీ వీడుతారనే ప్రచారం మొదలయ్యింది.

ఇదిలాఉంటే, బెంగాల్‌ అటవీశాఖ మంత్రి రాజీవ్‌ బెనర్జీ కూడా పార్టీలోని ఓ వర్గంపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఇలా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కీలక నేతలు వరుసగా అసమ్మతి స్వరాన్ని పెంచడంతో పార్టీ అధినాయకత్వంపై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి..
అధికారి లేకుండా దీదీ హ్యాట్రిక్‌ కొట్టగలరా?
అమిత్‌ షా సమక్షంలో భాజపాలోకి సువెందు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని