దుబ్బాక ఉపఎన్నికకు సర్వం సిద్ధం

రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న దుబ్బాక ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది.

Updated : 02 Nov 2020 21:39 IST

రేపే పోలింగ్‌.. ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం

సిద్దిపేట: రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న దుబ్బాక ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. దుబ్బాకలోని లచ్చపేట పాఠశాల నుంచి ఎన్నికల సిబ్బంది ఈవీఎం, ఇతర పోలింగ్‌ సామగ్రిని తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్లారు. ఉప ఎన్నికలో 1,98,807 మంది ఓటర్లు పార్టీల భవితవ్యాన్ని తేల్చనున్నారు. నియోజకవర్గంలో 315 పోలింగ్‌ కేంద్రాలుండగా.. వీటిలో 89 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. కరోనా రోగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పీపీఈ కిట్లను సిద్ధం చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఆశా కార్యకర్త లేదా ఏఎన్‌ఎంను అందుబాటులో ఉంచనున్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలను శానిటైజ్‌ చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పోలింగ్‌ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యూలైన్లలో ఆరు అడుగుల దూరం ఉండేలా ఇప్పటికే మార్కింగ్‌ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

 

కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం: రిటర్నింగ్‌ అధికారి 

దుబ్బాక ఉపఎన్నిక కోసం అయిదు వేలమందికి పైగా విధులు నిర్వహిస్తున్నారని రిట్నరింగ్‌ అధికారి చెన్నయ్య తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ‘‘కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలోనూ అప్రమత్తంగా ఉన్నాం. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో బకెట్‌, సబ్బు, శానిటైజర్‌ అందుబాటులో ఉంటాయి. ఓటు వేయటానికి వచ్చే వారికి గ్లౌజులు, మాస్క్‌లు ఇస్తాం. పోలింగ్‌ సిబ్బందికీ మాస్క్‌లు అందజేశాం. కరోనా లక్షణాలు ఉన్న వారికి చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతిస్తాం. కరోనా బాధితులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించాం. సీనియర్‌ సిటిజన్లు, పీడబ్ల్యూడీ ఓటర్లకు కూడా పోస్టల్‌ బ్యాలెట్లు జారీ చేశాం. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు రూ.58 లక్షలను సీజ్ చేశాం. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులూ నమోదు చేశాం. ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లతో పాటు ఇతర బృందాలతో నిరంతర నిఘా ఉంచాం. ఎన్నికలు ముగిసే వరకూ ఈ నిఘా కొనసాగుతుంది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’’ అని చెన్నయ్య వివరించారు.

తెరాస ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉపఎన్నిక జరుగుతోంది. ఉపఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు నిలిచినప్పటికీ ప్రధాన పోటీ మాత్రం అధికార తెరాస, భాజపా, కాంగ్రెస్‌ మధ్యే ఉండనుంది. తెరాస తరఫున దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాత, భాజపా తరఫున రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీలకు చెందిన నేతలంతా తమ అభ్యర్థుల విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డారు. తెరాస అభ్యర్థికి మద్దతుగా మంత్రి హరీశ్‌రావు అన్నీతానై నడిపించగా.. భాజపా, కాంగ్రెస్‌ తరఫున ఆయా పార్టీల ముఖ్యనేతలు నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను పర్యవేక్షించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని తెరాస నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు విజయాన్ని తెచ్చిపెడుతుందని భాజపా, కాంగ్రెస్‌ చెబుతున్నాయి. ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఈనెల 10న చేపట్టనున్నారు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని