
‘ఏపీ మంత్రి కుమారుడికి బెంజికారు లంచం’
తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ఆరోపణ
విశాఖపట్నం: ఏపీ కార్మికశాఖమంత్రి గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్‌కు ఓ కేసులో ఏ14 నిందితుడిగా ఉన్న వ్యక్తి బెంజికారు బహుమతిగా ఇచ్చారని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన్నపాత్రుడు మాట్లాడుతూ... మంత్రి జయరాంకు ఏ14గా ఉన్న వ్యక్తి బినామీ అని పేర్కొన్నారు. మంత్రికి బినామీ కాబట్టే ఆయన కుమారుడికి ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చారని విమర్శించారు. ‘మంత్రి కుమారుడికి ఇచ్చింది పుట్టినరోజు కానుక కాదు.. లంచం’ అని ఆరోపించారు. ఓ ముద్దాయికీ మంత్రి జయరాం కుమారుడికి సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. ఈశ్వర్‌కు బెంజికారు ఇస్తున్న ఫొటోను మీడియాకు విడుదల చేశారు. ఈ విషయమై ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ జరిపించాల్సిన అవసరముందన్నారు. జయరాంను మంత్రి మండలి నుంచి తప్పించాలని ఈ సందర్భంగా అయ్యన్న డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం ఏ కమిటీ వేసినా ఆధారాలు చూపడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితిలో జయరాంను మంత్రిగా కొనసాగించడం న్యాయం కాదన్నారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా తెదేపా నేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా బీసీ నాయకుల జోలికొస్తే సమాధి అవుతారని హెచ్చరించారు.
ఏసీబీ కాల్ సెంటర్‌కు ఫిర్యాదు..
మీడియా సమావేశం నుంచి అయ్యన్నపాత్రుడు అవినీతి నిరోధక శాఖ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ‘‘ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కంపెనీలో అవినీతి జరిగింది. కుంభకోణంలో కార్మికశాఖ మంత్రి జయరాం, ఆయన కుమారుడు ఈశ్వర్ ప్రమేయం ఉంది. మంత్రి కుమారుడు ఈశ్వర్‌కు లంచంగా బెంజికారు ఇచ్చారు’’ అని వివరించారు. ‘‘అవినీతి జరిగితే ఫోన్ చేసిన 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. కుంభకోణం విషయంలో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నా’’ అని అయ్యన్నపాత్రుడు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.