‘ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదు’

‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమంపై ప్రతిపక్షం బురద జల్లుతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. మంచి కార్యక్రమాన్ని చూసి

Published : 10 Oct 2020 16:32 IST

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

విజయవాడ: ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమంపై ప్రతిపక్షం బురద జల్లుతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. మంచి కార్యక్రమాన్ని చూసి ప్రతిపక్షం కడుపు రగిలిపోతోందని వ్యాఖ్యానించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో 43 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్న ఈ పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు. ఇతర రాష్ట్రాలు ఈ పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడం చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి సురేష్‌ మండిపడ్డారు.

ఈ పథకానికి ఖర్చు చేస్తున్న నిధులు నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వానివేనని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి స్టిక్కర్‌ సీఎం కారని.. స్ట్రైకింగ్‌ సీఎం అని ఆయన పేర్కొన్నారు. పాఠశాల బ్యాగులు, నోట్‌ పుస్తకాలు, బూట్లు, బెల్టుల ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని స్పష్టం చేశారు. యూనిఫాం, టెక్ట్స్‌ పుస్తకాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని వివరించారు. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడైనా ఉందా? ‘జగనన్న విద్యాకానుక’పై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రతిపక్షాలకు మంత్రి సవాల్‌ విసిరారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పారంటే కచ్చితంగా చేసి తీరుతారనే ప్రజలు అనుకుంటున్నారని మంత్రి సురేష్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని