వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం

వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. పోడియం వద్దకు దూసుకొచ్చి, వ్యవసాయ బిల్లు ప్రతులను చించేసి ప్రతులను డిప్యూటీ ఛైర్మన్‌పైకి విసిరేశారు. ఆయన వద్ద మైకు లాగేందుకు ప్రయత్నించారు. దీంతో రాజ్యసభ సిబ్బంది..

Updated : 20 Sep 2020 15:10 IST

దిల్లీ: వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ఉద్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన ‘ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ బిల్లు, ఫార్మర్స్‌ అగ్రిమెంట్‌ ఆన్ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్ ఫార్మర్స్‌ సర్వీసు’ బిల్లులు తాజాగా రాజ్యసభ ఆమోదం కూడా పొందాయి. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా విపక్షాలు ప్రవేశపెట్టిన సవరణ తీర్మానాలు వీగిపోయాయి. కాంగ్రెస్‌, తెరాస, శిరోమణి అకాలీదళ్‌ సహా 14 పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకించినప్పటికీ.. బిల్లులకు ఆమోదం లభించింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.

విపక్షాల గందరగోళం

వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. పోడియం వద్దకు దూసుకొచ్చి, వ్యవసాయ బిల్లుల ప్రతులను చించేసి డిప్యూటీ ఛైర్మన్‌పైకి విసిరారు. ఆయన వద్ద మైకు లాగేందుకూ ప్రయత్నించారు. దీంతో రాజ్యసభ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. తృణమూల్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. బిల్లులపై సందేహాలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని జేడీఎస్‌ డిమాండ్‌ చేసింది. కొత్తచట్టం వల్ల రైతులకు జరిగే ప్రయోజనాలేమిటో చెప్పాలని మాజీ ప్రధాని, ఇవాళే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన దేవెగౌడ్‌ కోరారు. బిల్లులను ఆగమేఘాల మీద ప్రవేశపెడుతున్నారని విమర్శించారు.

బిల్లులు చరిత్రాత్మకం: తోమర్‌

అంతకుముందు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెడుతూ.. రైతు, వ్యవసాయ సంబంధ బిల్లులు చరిత్రాత్మకమైనవని పేర్కొన్నారు. రైతుల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు ఈ బిల్లులు దోహదపడతాయని చెప్పారు. రైతులు తమ ఉత్పత్తులను బహిరంగ మార్కెట్‌లో స్వేచ్ఛగా విక్రయించుకునేందుకు వీలు కల్పిస్తాయన్నారు. కాంగ్రెస్‌ సహా ఇతర విపక్షాలు మాత్రం బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకే ఈ బిల్లులు తీసుకొచ్చారని మండిపడ్డాయి. కనీస మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం జరిపే పంట సేకరణ విధానానికి ముగింపు పడుతుందని ఆరోపించాయి. చర్చలో పాల్గొన్న కాంగ్రెస్‌ ఎంపీ ప్రతాప్‌సింగ్‌ బజ్వా రైతులకు మరణశాసనమైన ఈ బిల్లులపై సంతకం చేసేందుకు సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకంగా ఉన్నాయని సమాజ్‌ వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్‌ యాదవ్‌ అన్నారు. కార్పొరేట్ల విస్తరణకు దోహదపడేలా ఈ బిల్లు రూపొందించారని ఆరోపించారు.

వైకాపా మద్దతు

రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైకాపా మద్దతిచ్చింది. వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... గతంలో దళారీల దయాదాక్షిణ్యాలపై రైతులు బతికారని, ఈ బిల్లుల ద్వారా గిట్టుబాటు ధర దక్కుతుందన్నారు. నచ్చినచోట పంట అమ్ముకోవడం వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. (వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పీచ్‌)


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని