విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి: మోదీ

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యవసాయ రంగ బిల్లులు చరిత్రాత్మకమని, రైతులకు రక్షణ కవచంలా ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విపక్షాలు మాత్రం వీటిపై  రైతులను తప్పుదోవ పట్టించొద్దని మండిపడ్డారు. ఈ బిల్లులతో రైతులకు సరైన ధర లభించదంటూ.........

Updated : 18 Sep 2020 15:55 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యవసాయ రంగ బిల్లులు చరిత్రాత్మకమని, రైతులకు రక్షణ కవచంలా ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విపక్షాలు మాత్రం వీటిపై  రైతులను తప్పుదోవ పట్టించొద్దని మండిపడ్డారు. ఈ బిల్లులతో రైతులకు సరైన ధర లభించదంటూ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారన్నారు. బిహార్‌లో పలు రైల్వే ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్‌‌ మాధ్యమంలో ప్రారంభించిన మోదీ.. లోక్‌సభలో నిన్న ఆమోదం పొందిన వ్యవసాయ సంబంధిత బిల్లులపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్న విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. గోధుమలు, వరి వంటి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు రైతుల నుంచి సేకరించవంటూ దుష్ప్రచారం జరుగుతోందన్నారు. ఇది పూర్తిగా అవాస్తవమని, తప్పుడు సమాచారంతో మోసగిస్తున్నారని, రైతులు అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు.

ఎంతో కాలంగా కొనసాగుతున్న దోపిడీ వ్యవస్థనే ఉంచాలని, రైతుల కష్టాలు అలాగేఉండాలని వారు కోరుకుంటున్నారన్నారు. కొన్ని దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నా రైతులకు ఏమీ చేయనివారు ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు.  కేంద్ర ప్రభుత్వం రైతులకు కనీస మద్ధతు ధర కల్పించడం ద్వారా పండించిన పంటలకు సరైన ధరలు కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు. రైతాంగానికి లభిస్తున్న కొత్త అవకాశాలను చూసి తట్టుకోలేకపోతున్నారనే విషయాన్ని దేశ రైతులు గమనిస్తున్నారని చెప్పారు. మధ్యవర్తుల వైపు ఎవరు నిలబడుతున్నారో చూస్తున్నారని అన్నారు. తాము తీసుకొచ్చిన ఈ బిల్లులను గతంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. 

ఇందులో రాజకీయం ఏముంది?: హర్‌సిమ్రత్‌
మరోవైపు, నిన్న లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లులపై విపక్షాలతో పాటు భాజపా మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రైతు వ్యతిరేక బిల్లులని పేర్కొంటూ అకాలీదళ్‌ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న హర్‌సిమ్రత్‌ కౌర్‌ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె శుక్రవారం స్పందించారు. బిల్లులును తెచ్చే ముందే రైతులతో సంప్రదించాలని తాను చెప్పానని, ఇందులో రాజకీయం ఏముందని ఆమె ప్రశ్నించారు. కేంద్రం ప్రతిపాదించిన ఈ బిల్లులకు కేవలం పంజాబ్‌లోనే కాకుండా  హరియాణా, రాజస్థాన్‌, యూపీ, మహారాష్ట్రల్లో కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయన్నారు. అలాగే, దక్షిణ భారతదేశంలో కూడా రైతుల్లో వ్యతిరేకత వస్తోందని చెప్పారు. ఈ బిల్లులపై శిరోమణి అకాలీదళ్‌ తీసుకున్న వైఖరితో హరియాణాలో భాజపా మిత్రపక్షం జేజేపీ ఇరుకునపడింది. ఆ పార్టీ నేత, డిప్యూటీ సీఎం దుష్యంత్‌ చౌటాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని