Updated : 23 Dec 2020 14:27 IST

భాజపా మాజీ మంత్రి.. 11ఓట్లతో ఓటమి

JK డీడీసీ ఎన్నికల్లో గుప్కార్‌కు 110.. భాజపాకు 74సీట్లు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తొలిసారిగా జరిగిన జిల్లా అభివృద్ధి మండళ్ల(డీడీసీ) ఎన్నికల్లో స్థానిక పార్టీల కూటమి ‘పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌’ సత్తా చాటింది. మొత్తం 280 స్థానాలకు గానూ ఇప్పటివరకు 276 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో గుప్కార్‌ కూటమి 110 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇక భాజపా 74చోట్ల విజయం సాధించింది. ముఖ్యంగా కశ్మీర్‌ లోయలో గుప్కార్‌ హవా కొనసాగించగా.. జమ్మూలో భాజపా పట్టు నిలుపుకుంది. ఇక మరో 49 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందగా.. కాంగ్రెస్‌ 26 చోట్ల, జమ్మూకశ్మీర్‌ అప్నీ పార్టీ 12 స్థానాల్లో, ఇతరులు ఐదు చోట్ల విజయం సాధించారు. కాగా.. బందీపొరా, కుప్వారా, పూంఛ్‌, రాజౌరీ జిల్లాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. 

మాజీ మంత్రికి షాక్‌..

కాగా.. జమ్మూలోని సుచేత్‌గఢ్‌ నియోజకవర్గంలో భాజపా మాజీ మంత్రి శ్యామ్‌ లాల్‌ చౌధరీకి గట్టి షాక్ తగిలింది. ఫలితాల్లో ఆయన కేవలం 11 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అధికారిక గణాంకాల ప్రకారం.. స్వత్రంత్ర అభ్యర్థి తరణ్‌జీత్‌ సింగ్‌ 12,969 ఓట్లతో ఇక్కడ విజయం సాధించగా.. శ్యామ్‌లాల్‌కు 12,958ఓట్లు పోలయ్యాయి. పునర్‌వ్యవస్థీకరణకు ముందు జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలోని భాజపా-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వలో ఆయన‌‌ మంత్రిగా పనిచేశారు. ఆర్‌ఎస్‌ పురా బోర్డర్‌ బెల్డ్‌ రీజియన్‌లో కాషాయ పార్టీకి బలమైన నేతగా పేరొందిన ఆయన.. 2008, 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుచేత్‌గఢ్‌ నుంచి విజయం సాధించారు. తాజాగా డీడీసీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగగా.. స్వతంత్ర అభ్యర్థి ఆయనకు షాకిచ్చారు. 

జమ్మూకశ్మీర్‌లోని 20 జిల్లాల్లోని 280 డీడీసీలకు నవంబరు 28 నుంచి డిసెంబరు 19 వరకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరిగాయి. మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు చేపట్టారు. 370 అధికరణ రద్దు, పునర్‌వ్యవస్థీకరణ తర్వాత జమ్మూకశ్మీర్‌లో జరిగిన తొలి ప్రజాస్వామ్య ప్రక్రియ ఇదే. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల గుప్కార్‌ కూటమి సంబరాల్లో మునిగింది. ఈ ఫలితాలు భాజపాకు కనువిపప్పు అని, ప్రత్యేక హోదా రద్దు నిర్ణయాన్ని ప్రజలు తిరస్కరించారని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఆర్టికల్‌ 370 రద్దు సమయంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ), పీపుల్స్ డెమొక్రటిక్‌ పార్టీ(పీడీపీ) లాంటి ప్రధాన పార్టీలతో పాటు మరో అయిదు చిన్న పార్టీలు కలిసి గుప్కార్‌ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. 

ఇవీ చదవండి..

సర్పంచులను ఇబ్బంది పెడుతున్నారు

డీఎంకే, అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోం

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని