‘ఆడపిల్లల్ని కాదు.. అపరాధుల్ని రక్షిస్తున్నారు’

యూపీలో భాజపా సర్కార్‌పై కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడపిల్లల్ని రక్షించే కార్యక్రమం కంటే ఆపరాధుల్ని రక్షించే పనులే కొనసాగుతున్నాయని దుయ్యబట్టారు..........

Published : 18 Oct 2020 13:41 IST

యోగి సర్కార్‌పై రాహుల్‌, ప్రియాంక ధ్వజం

దిల్లీ: యూపీలో భాజపా సర్కార్‌పై కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఆడపిల్లల్ని రక్షించే కార్యక్రమం కంటే ఆపరాధుల్ని రక్షించే పనులే కొనసాగుతున్నాయని దుయ్యబట్టారు. పరోక్షంగా.. జైల్లో బంధించిన ఓ నిందితుణ్ని భాజపా ఎమ్మెల్యే విడిపించి తీసుకెళ్లిన ఘటనను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బేటీ బచావోతో ప్రారంభమైన పథకం.. అపరాధీ బచావో(నేరగాళ్లను రక్షించండి) దిశగా సాగుతోంది’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. దీనికి భాజపా ఎమ్మెల్యే వ్యవహారాన్ని ప్రచురించిన ఓ పత్రిక కథనాన్ని జోడించారు. మరోవైపు ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. ‘‘ఈ సంఘటన ఏ మిషన్‌ కింద చేపట్టారో యూపీ ముఖ్యమంత్రి చెబుతారా? బేటీ బచావోనా లేక అపరాదీ బచావోనా?’’ అని ట్విటర్‌లో ప్రశ్నించారు.

యూపీలో మహిళలపై ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస దాడులను ఉద్దేశించి కాంగ్రెస్‌ గత కొన్ని రోజులుగా అక్కడి భాజపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ముఖ్యంగా హాథ్రస్‌ హత్యాచార ఘటన విషయంలో యోగి సర్కార్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుపై సీబీఐ విచారణ జరుపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని