Vijay Rupani: గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ రాజీనామా

గుజరాత్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర సీఎం విజయ్‌ రూపానీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు.

Updated : 11 Sep 2021 16:38 IST

గాంధీనగర్‌: ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ మేరకు నేడు గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌కు రాజీనామా సమర్పించారు. మరో 15 నెలల్లో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. రాజీనామాకు గల కారణాలు తెలియరాలేదు. 

అభివృద్ధి కోసమే రాజీనామా..

రాజీనామా సమర్పించిన అనంతరం రూపానీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను పదవి నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ‘‘నూతన నాయకత్వంలో కొత్త ఉత్సాహం, కొత్త శక్తితో గుజరాత్‌ అభివృద్ధి పథంలో మరింత దూసుకెళ్తుందని ఆశిస్తున్నా. దీన్ని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశా. నా లాంటి పార్టీ కార్యకర్తకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన అధిష్ఠానానికి కృతజ్ఞతలు. నా పదవి కాలం మొత్తంలో ప్రధాని మోదీ ఎంతగానో మార్గనిర్దేశం చేశారు. ఆయన మార్గదర్శకత్వంలో గుజరాత్.. అభివృద్ధిలో కొత్త శిఖరాలను చేరుకుంది. ఇందులో నా వంతు సహకారం అందించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా’’ అని రూపానీ వివరించారు.

2016 ఆగస్టు 7న రూపానీ.. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం మరో ఏడాది పాటు ఉంది. అయితే భాజపా అధిష్ఠానం ఆదేశాలతోనే ఆయన సీఎం కుర్చీ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. కొత్త నాయకత్వం నేతృత్వంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. పటేల్‌ సామాజిక వర్గానికి చెందిన నేతకే తదుపరి సీఎం బాధ్యలు అప్పగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న నాలుగో భాజపా ముఖ్యమంత్రి ఈయన. అంతకుముందు కర్ణాటకలో భాజపా నేత యడియూరప్ప, ఉత్తరాఖండ్‌లో త్రివేంద్ర సింగ్‌ రావత్‌, తీరథ్‌ సింగ్‌ రావత్‌ కూడా సీఎం పదవులకు రాజీనామా చేశారు. 

కొత్త సీఎం ఎవరో..

రూపానీ రాజీనామాతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తర్వాత సీఎంను ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు వచ్చే మంగళవారం సమావేశం కానున్నట్లు సమచారం. సీఎం రేసులో కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, గుజరాత్‌ ఉపముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ పేర్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది డిసెంబరులో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని