
రాజకీయంగా కుట్ర చేసి చంపారు:జేడీఎస్
బెంగళూరు: కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్, జేడీఎస్ ఎమ్మెల్సీ ధర్మెగౌడ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. ఇది రాజకీయ కుట్ర అని, వెంటనే నిజ నిర్ధారణ కమిటీ వేసి, దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇటీవల విధాన పరిషత్ లో జరిగిన ఘటనలు ధర్మెగౌడను కలవరపరిచాయని కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాజకీయంగా కుట్ర చేసి, ఈ హత్య చేశారు. గౌడను ఛైర్మన్ సీటు నుంచి కిందికి లాక్కెళ్లి, అవమానించారు. వారు చేసింది తప్పో, ఒప్పో ఒకసారి వారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి’ అని కాంగ్రెస్ వ్యవహరించిన తీరును తప్పుపట్టారు.
డిసెంబర్ 15న కర్ణాటక విధాన పరిషత్ సమావేశాల్లో రసాభాస జరిగింది. ఛైర్మన్ కే చంద్రప్రతాప్ శెట్టిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభ్యులు వాగ్వాదాలకు దిగారు. మాటల దాడులతో పాటు ఒకరినొకరు తోసుకున్నారు. సభాపతి స్థానంలో ఉన్న ధర్మెగౌడను కాంగ్రెస్ సభ్యులు ఛైర్మన్ సీటు నుంచి లాక్కెళ్లారు. ఇదిలా ఉండగా, సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ధర్మెగౌడ..మంగళవారం రైల్వే ట్రాక్ పక్కన శవమై కనిపించారు. ఆయన రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన మరణంపై రాజకీయ పక్షాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
ఇవీ చదవండి:
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.