ఓటమికి బాధ్యత వహిస్తున్నా: హరీశ్‌రావు

దుబ్బాక ఉపఎన్నికలో భాజపా విజయంపై తెరాస కీలకనేత, మంత్రి హరీశ్‌రావు స్పందించారు.

Updated : 12 Oct 2022 15:55 IST

హైదరాబాద్‌: దుబ్బాక ఉపఎన్నికలో భాజపా విజయంపై తెరాస కీలకనేత, మంత్రి హరీశ్‌రావు స్పందించారు. తెరాసకు ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఓటమికి బాధ్యత వహిస్తున్నానని, ఓడిపోవడానికి గల కారణాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామని అన్నారు. దుబ్బాక ప్రజా సేవలో నిరంతరం పాటుపడతామని చెప్పారు. ఓడిపోయినప్పటికీ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని, సీఎం నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తామని తెలిపారు. దుబ్బాక తీర్పును మంత్రి కేటీఆర్‌ కూడా అంగీకరించిన విషయం తెలిసిందే. తాము అనుకున్నట్లుగా ఫలితాలు రాలేదని, ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయిలో విశ్లేషించి భవిష్యత్‌లో ముందుకు పోతామని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు దుబ్బాకలో భాజపా, తెరాస అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నంతగా పోటీ ఏర్పడింది. రౌండ్‌ రౌండ్‌కూ ఫలితాలు ఉత్కంఠ రేకెత్తించాయి. ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య విజయం దోబూచులాడింది. నరాలు తేగే ఉత్కంఠ నడుమ చివరికి భాజపా అభ్యర్థి రఘునందన్‌ రావు విజయం సాధించారు. మొత్తం 23 రౌండ్లలో ఓట్లను లెక్కించగా..మొదటి ఐదు రౌండ్లతో పాటు 8, 9, 11, 20, 22, 23 రౌండ్లలో భాజపా ఆధిక్యం ప్రదర్శించింది. 6, 7, 10, 13, 14, 15, 16, 17, 18, 19 రౌండ్లలో అధికార తెరాస హవా కొనసాగింది. 12వ రౌండ్‌లో కాంగ్రెస్‌ ముందంజలో నిలిచింది. మొత్తం 23 రౌండ్లు. భాజపా  12 రౌండ్లలో ఆధిక్యం కనబరిచింది. తెరాస 10 రౌండ్లలో గెలిచింది. ఒక రౌండ్‌లో కాంగ్రెస్‌ ముందుంది. అయితే భాజపా, తెరాస మధ్య స్వల్వ ఆధిక్యమే ఉండటంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న దానిపై చివరి వరకు స్పష్టత రాలేదు. 23వ రౌండ్‌లో భాజపా 412 ఓట్లు ఆధిక్యం సాధించడంతో అప్పటికే 1058 మెజార్టీతో ఉన్న ఆ పార్టీ అభ్యర్థి రఘునందర్‌రావు 1470 ఓట్ల ఆధిక్యంతో విజయదుందుభి మోగించారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ మూడో స్థానంలో నిలిచింది.

 


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని