దేశంలో నియంతృత్వం పెరుగుతోంది: సోనియా

దేశంలోని పేదల వ్యతిరేక, దేశ వ్యతిరేక  శక్తులు  ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ కూడా........

Published : 30 Aug 2020 01:50 IST

దిల్లీ: దేశంలోని పేదల వ్యతిరేక, దేశ వ్యతిరేక శక్తులు ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ కూడా ప్రమాదంలో పడిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దేశం ఇలాంటి సంక్షోభంలో పడుతుందని జాతి నిర్మాతలు కూడా ఊహించి ఉండరన్నారు. శనివారం ఆమె ఛత్తీస్‌గఢ్‌ కొత్త అసెంబ్లీ భవనానికి భూమి పూజ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ..  ప్రజాస్వామిక దేశమైన భారత్‌లో నియంతృత్వం పెరుగుతోందన్నారు. దేశ వ్యతిరేక శక్తులు ప్రజల్లో ద్వేషం, హింసతో పాటు విషాన్ని వ్యాప్తి చేస్తున్నాయన్నారు.

స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ల తర్వాత భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్యం ధ్వంసమవుతోందని వ్యాఖ్యానించారు. అలాగే, ప్రజాస్వామిక వ్యవస్థలు కూడా నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. దేశ ప్రజలు, గిరిజనులు, మహిళలు, యువకులు ఎవరూ నోరు మెదపకూడదని వారు కోరుకుంటున్నారంటూ సోనియా వ్యాఖ్యలు చేశారు.  జాతిపిత మహాత్మా గాంధీ, జవహర లాల్‌ నెహ్రూ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తదితర జాతి నిర్మాతలెవరూ 75 ఏళ్ల స్వాతంత్ర్యానంతరం భారత్‌ ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుందని ఊహించి ఉండరన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం నేడు ప్రమాదంలో పడ్డాయని వ్యాఖ్యానించారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ భాఘేల్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని