12 ఓట్లతో గెలిచేశాడు.. 

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ముందు నుంచి ప్రధాన కూటముల మధ్య ఆధిక్యం దోబూచులాడగా చివరకు విజయం ఎన్డీయేను వరించింది. చివరివరకు మహాగట్‌

Updated : 11 Nov 2020 12:05 IST

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ముందు నుంచి ప్రధాన కూటముల మధ్య ఆధిక్యం దోబూచులాడగా చివరకు విజయం ఎన్డీయేను వరించింది. చివరివరకు మహాగట్‌ బంధన్‌ కూటమి.. ఎన్డీయేకు గట్టిపోటీనిచ్చింది. కొన్ని చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య తేడా 500 ఓట్లకు మించలేదు. కాగా.. హిల్సా నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థి కేవలం 12 ఓట్ల తేడాతో విజయం సాధించడం విశేషం. 

ఎన్నికల పలితాలను ఈసీ మంగళవారం అర్ధరాత్రి తర్వాత తమ వెబ్‌సైట్లో అప్‌డేట్‌ చేసింది. ఆ వివరాల ప్రకారం.. హిల్సా నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థి కృష్ణమురారీ శరణ్‌ అలియాస్‌ ప్రేమ్‌ ముఖియా తన సమీప ఆర్జేడీ ప్రత్యర్థి అత్రి మునిపై కేవలం 12 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఫలితాల్లో ప్రేమ్‌ ముఖియాకు 61,848 ఓట్లు రాగా.. అత్రి మునికి 61,836 ఓట్లు పోలయ్యాయి. 

అయితే హిల్సా ఫలితంపై ఆర్జేడీ అనుమానాలు వ్యక్తం చేసింది. ‘హిల్సాలో అత్రి ముని 547 ఓట్లతో గెలిచినట్లు తొలుత రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. కాసేపట్లో ధ్రువపత్రం ఇస్తామన్నారు. అయితే అంతలోనే రిటర్నింగ్‌ అధికారికి ముఖ్యమంత్రి నివాసం నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో ఆ అధికారి వెంటనే మాటమార్చారు. పోస్టల్‌ బ్యాలెట్లను రద్దు చేసినందు వల్ల ఆర్జేడీ అభ్యర్థి ఓడిపోయినట్లు మళ్లీ ప్రకటించారు’ అని ఆర్జేడీ ట్విటర్‌ వేదికగా ఆరోపించింది. కాగా.. ఆర్జేడీ ఆరోపణలను ఎన్నికల కమిషన్‌ తోసిపుచ్చింది. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, పారదర్శకంగానే లెక్కింపు ప్రక్రియ చేపట్టినట్లు తెలిపింది. ఏదేమైనా కేవలం 12 ఓట్లతో ఆర్జేడీ ఒక సీటు కోల్పోవాల్సి వచ్చింది. 

ఇవీ చదవండి..

ఎన్డీయే జోరు

ఓడినా.. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని