రాహుల్ అసమర్థుడైన రాకుమారుడు: జేపీ నడ్డా

కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్ గాంధీ అసమర్థుడైన రాకుమారుడని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. పీఎం కేర్స్‌ నిధుల వివరాలు తెలుసుకునేందుకు దాఖలైన సమాచార హక్కు చట్టం....

Published : 18 Aug 2020 01:57 IST

దిల్లీ: కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్ గాంధీ అసమర్థుడైన రాకుమారుడని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. పీఎం కేర్స్‌ నిధుల వివరాలు తెలుసుకునేందుకు దాఖలైన సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తును ప్రధాని కార్యాలయం తిరస్కరించిందని ఒక వార్తా పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఉటంకిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. తాజాగా రాహుల్ ట్వీట్‌పై నడ్డా స్పందించారు. ‘‘అసమర్థుడైన రాకుమారుడు పూర్తి వార్తను చదవకుండానే షేర్‌ చేస్తుంటారు. ఆర్టీఐ పీఎం కేర్స్‌ గురించి మాత్రమే కాకుండా ఇతర ఆర్టీఐల గురించి తెలుసుకునేందుకు ఆ దరఖాస్తు చేశారు. పారదర్శకతపై మీరు చేసిన దాడి కావడంచేత దానిని తిప్పి పంపండం జరిగింది. ఇది సహజం, ఎందుకంటే మీ కెరీర్‌ మొత్తం నకిలీ వార్తల వ్యాప్తిపైనే ఆధారపడి ఉంది’’ అని నడ్డా ట్వీట్ చేశారు.

దేశం మొత్తానికి ప్రధానిపై, ఆయన చేపడుతున్న కార్యక్రమాలపైన నమ్మకం ఉందని, పీఎం కేర్స్‌కు భారీగా విరాళాలు పంపండంతో మరోసారి ఆ నమ్మకం రుజువైందని నడ్డా అన్నారు. దేశం మొత్తం కరోనాపై కలిసికట్టుగా పోరాడుతుంటే, ఓడిపోయిన వ్యక్తులు మాత్రం నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆయన రాహుల్‌ను విమర్శించారు. అలానే ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్‌) నుంచి మొత్తం సొమ్మును గాంధీ కుటుంబం తన ట్రస్టులకు తరలించాలని చూసిందని నడ్డా ఆరోపించారు. జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా చైనా కమ్యూనిస్ట్‌ పార్టీతో ఒప్పందాలు చేసుకున్నారని రాహుల్, సోనియాను ఉద్దేశించి మరోసారి విమర్శలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని