కేటీఆర్‌ను సీఎం చేసే యోచనలో కేసీఆర్‌

దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలో భాజపా, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కంటిమీద కునుకు

Published : 03 Nov 2020 01:21 IST

పీసీసీ ప్రచారకమిటీ ఛైర్‌పర్సన్‌ విజయశాంతి

హైదరాబాద్‌: దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలో భాజపా, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కంటిమీద కునుకు లేకుండా పని చేస్తున్నారని, కానీ ఎన్నిక తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయనకు షాక్‌ ఇవ్వబోతున్నారని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ విజయశాంతి అన్నారు. దుబ్బాక ఉపఎన్నిక తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించి, ఆ ఫలితాలు రాగానే, తన తనయుడు కేటీఆర్‌కు సీఎం పదవి ఇచ్చేందుకు ఆయన రంగం సిద్ధం చేస్తున్నట్లు తెరాస వర్గాల్లో ప్రచారం జరుగుతోందన్నారు. 

ఈ వాదనకు బలం చేకూర్చేలా గతంలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి కేసీఆర్‌ నోట రాజీనామా మాట వచ్చిందని అన్నారు. భాజపా మీద నెపం పెట్టి..సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్‌ సంకేతాలివ్వడం భవిష్యత్‌ రాజకీయాలకు అద్దం పడుతోందని విజయశాంతి వ్యాఖ్యానించారు. తనపైన, సర్కారుపైనా నిరాధార ఆరోపణలు చేస్తే విపక్ష నేతల్ని జైలుకు పంపిస్తానని బెదిరించిన కేసీఆర్‌ ఇప్పుడు సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ కొత్త అంశాన్ని ఎందుకు తెరమీదకు తెచ్చారని విజయశాంతి ప్రశ్నించారు. 

ఓవైపు హరీశ్‌రావు దుబ్బాకలో భాజపా నేతల మీద విరుచుకుపడుతుంటే.. ఆయన ప్రచారాన్ని డామినేట్ చేసేలా కేసీఆర్‌ భాజపా నేతలకు సవాల్ విసరడం ఆనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ ప్రకటన భాజపా నేతలకే కాకుండా పరోక్షంగా హరీష్ రావుకి కూడా సంకేతం ఇచ్చినట్టేనని తెలంగాణ సమాజం భావిస్తోందన్నారు. తాజా పరిస్థితులను పరిశీలిస్తే.. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేటీఆర్‌ను సీఎం చేసే యోచనలో కేసీఆర్‌ ఉన్నారని ఆమె అన్నారు. నమ్మిన వారిని మోసం చేయడంలో కేసీఆర్‌ వ్యవహారశైలే వేరని ఆమె విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని