కేంద్రానికి స్పష్టమైన సందేశమివ్వాలనే..: కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా తెరాస శ్రేణులు ఈనెల 8న భారత్‌ బంద్‌లో పాల్గొనాలని..

Published : 07 Dec 2020 01:06 IST

8న తెరాస శ్రేణులు భారత్‌ బంద్‌లో పాల్గొనాలి
కొత్త చట్టాలతో రైతులకు ఉన్న ఇబ్బందులను వివరించాలని పిలుపు

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా తెరాస శ్రేణులు ఈనెల 8న భారత్‌ బంద్‌లో పాల్గొనాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నిరసన తెలిపి రైతుల పోరాటానికి అండగా నిలవాలని సూచించారు. రైతుల కోసం రాష్ట్రంలో ఎన్నో పురోగమన, ప్రగతిశీల విధానాలు తీసుకొచ్చిన రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన సందేశమివ్వాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా రైతులు ఈ నిరసనలో పాల్గొనాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. భారత్‌ బంద్‌ జరిగే రోజు వ్యాపార, వాణిజ్య సంఘాలు రైతులకు సంఘీభావంగా తమ దుకాణ సముదాయాలను 2 గంటల ఆలస్యంగా ప్రారంభించుకోవాలని.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత దుకాణాలు తెరుచుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లోని వాణిజ్య, వ్యాపార సంఘాలకు కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వివరించాలన్నారు. 

రవాణా కార్యకలాపాలను కూడా మధ్యాహ్నం తర్వాతే ప్రారంభించుకోవాలని కేటీఆర్‌ సూచించారు. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు రోడ్లమీదకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతు ఏవిధంగా ఇబ్బంది పడతాడు? వ్యవసాయం కార్పొరేట్‌ శక్తుల గుప్పిట్లో ఎలా బందీ కాబోతోంది? కనీస మద్దతు ధర రాకుండా కేంద్రం ఏవిధంగా పన్నాగం పన్నింది... తదతర విషయాలను వివరించాలని తెరాస శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ జాతీయ రహదారులపై మోహరించి నిరసన తెలపాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా జాతీయ రహదారులపై జరిగే నిరసనల్లో పాల్గొనాలని కేటీఆర్‌ సూచించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. 

రైతు ఉద్యమాలకు కేసీఆర్ నాయకత్వం వహించాలి: నిరంజన్‌రెడ్డి

దేశంలోని రైతులందరినీ సంఘటితం చేయాల్సిన అవసరముందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతు ఉద్యమాలకు సీఎం కేసీఆర్‌ నాయకత్వం వహించాలని కోరారు. కేంద్రం విధానాల వల్ల వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉందన్నారు. రైతులను దెబ్బతీసి కార్పొరేట్‌ కంపెనీలకు లాభం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. వరికి కేంద్రం ఇచ్చే మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చేందుకు కేసీఆర్‌ సిద్ధమయ్యారని.. ఎక్కువ చెల్లింపులు చేయకుండా కేంద్రం ఆదేశాలు జారీ చేసి సీఎం ప్రయత్నాన్ని అడ్డుకుందని ఆరోపించారు.

 

ఇదీ చదవండి..  

భారత్‌ బంద్‌కు తెరాస సంపూర్ణ మద్దతు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని