కైలాశ్‌ వర్గియాకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం!

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై ఇటీవల పశ్చిమబెంగాల్‌లో దాడి ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలో గాయపడిన బెంగాల్‌ భాజపా ఇన్‌ఛార్జి కైలాశ్‌ విజయవర్గియాకు జెడ్‌ కేటగిరీ ........

Published : 14 Dec 2020 22:07 IST

కోల్‌కతా: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై ఇటీవల పశ్చిమబెంగాల్‌లో దాడి ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలో గాయపడిన భాజపా జాతీయ కార్యదర్శి, బెంగాల్‌ పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న కైలాశ్‌ విజయవర్గియాకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని ఏర్పాటుచేసింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని మధురాపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు తనకు బుల్లెట్‌ వాహనం కల్పించినట్టు తెలిపారు. ‌

వచ్చే ఏడాదిలో పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా కార్యకర్తలతో సమావేశమయ్యేందుకు ఈ నెల 10న జేపీ నడ్డా, కైలాశ్‌ వర్గియా తదితర నేతలు డైమండ్‌ హార్బర్‌ వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, కర్రలు, ఇటుకలతో దాడులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానిదే బాధ్యత అని భాజపా ఆరోపించగా.. కమలనాథుల ఆరోపణల్ని సీఎం మమతా బెనర్జీ తిప్పికొట్టారు. దీంతో కేంద్రం, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

నడ్డా కాన్వాయ్‌పై దాడి అనంతరం కైలాశ్‌ వర్గియా మాట్లాడుతూ.. ఈ ఘటనలో తనకు గాయాలైనట్టు తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడి కారు సైతం దాడికి గురైందని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.  పోలీసుల సమక్షంలోనే గూండాలు తమపై దాడి చేసినట్టు ఆయన ఆరోపించారు. ఈ దాడి సమయంలో తనకు స్వదేశంలోనే ఉన్నామా? అనే భావన కలిగిందని కైలాశ్‌ వర్గియా వ్యాఖ్యానించారు. 

ఇదీ చదవండి

‘బోడో’ ఎన్నికల్లో హంగ్‌.. భాజపా కొత్త పొత్తు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని