పార్లమెంట్‌ సమావేశాలు నిరవధిక వాయిదా

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. షెడ్యూల్‌ కంటే ఎనిమిది రోజుల ముందే ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. వాస్తవానికి అక్టోబర్‌ 1 వరకు సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా..........

Published : 24 Sep 2020 00:59 IST

దిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. షెడ్యూల్‌ కంటే ఎనిమిది రోజుల ముందే ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అక్టోబర్‌ 1 వరకు సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ముందే నిరవధిక వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. మధ్యాహ్నమే రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడగా.. తాజాగా లోక్‌సభ సమావేశాలను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. లోక్‌సభలో ఈ పది రోజుల్లో కొత్తగా 16 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. మొత్తం 10 సిట్టింగ్‌లలో 25 బిల్లులను ఆమోదించింది.

చివరి రోజైన బుధవారం రాజ్యసభలో పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రతకు సంబంధించిన మూడు కార్మిక సంస్కరణ బిల్లులు ఆమోదం పొందాయి. ఈ బిల్లుల ప్రకారం 300 మంది ఉద్యోగులు పనిచేసే సంస్థలు ఉద్యోగుల నియామకాలు, తొలగింపునకు అనుమతి ఇస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ బిల్లులకు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం లభించింది. అంతకముందు కీలక వ్యవసాయ బిల్లులకు ఉభయ సభల్లో ఆమోదం లభించింది. ఈ బిల్లులను విపక్షాలు వ్యతిరేకించడంతో సభలో గందరగోళ పరిస్థితి తలెత్తింది. విపక్షాలు ఉభయ సభల సమావేశాల్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి మంగళవారం వాకౌట్‌ చేసిన విషయం తెలిసిందే. 

మరోవైపు, పెద్దల సభ నుంచి అక్టోబర్‌లో పదవీ విరమణ చేయనున్న వారికి రాజ్యసభ వీడ్కోలు తెలిపింది. పదవీ విరమణ చేయనున్నవారిలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి  హర్దీప్‌సింగ్‌ పూరీ కూడా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని