
లోకేశ్ ఎదుట రైతుల ఆవేదన
అనంతపురం: భారీ వర్షాలు, వరదల కారణంగా అనంతపురం జిల్లాలో దెబ్బతిన్న పంటలను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుక్రవారం పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వేరుశనగ, పత్తి తదితర పంటలను పరిశీలించారు. మోకాళ్ల లోతు బురదలో దిగి రైతులతో మాట్లాడారు. ముందుగా గుత్తి మండలం కరిడికొండలో దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన లోకేశ్.. నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత పెద్దవడుగూరు మండలం మిడ్తూరులో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. భారీ వర్షాలు, వరదలతో పంటలు పూర్తిగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని ఈ సందర్భంగా రైతులు లోకేశ్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం లోకేశ్ మాట్లాడుతూ ఇవాళో, రేపో చేతికందుతుందనుకున్న పంట అకాల వర్షాలతో అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరిడికొండ గ్రామంలో పొలాల్లోనే కుళ్లిపోయిన వేరుశనగ పంటను చూస్తుంటే బాధేస్తోందన్నారు. వర్షాలు, వరదల కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు రూ.25వేలు పరిహారం ఇవ్వాలని లోకేశ్ డిమాండ్ చేశారు. 17 నెలలుగా రైతులకు ఎలాంటి రాయితీలు ఇవ్వట్లేదన్నారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్కటీ అమలు చేయట్లేదని ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులను అవమానించేలా యంత్రాంగం వ్యవహరిస్తోందని లోకేశ్ మండిపడ్డారు. ఆయన వెంట పార్టీ నేతలు జేసీ ప్రభాకర్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, కార్యకర్తలు ఉన్నారు.