
‘మధ్యప్రదేశ్ బాధ్యతలు మరోసారి భాజపాకే’
ఫలితాల సరళిపై సీఎం చౌహాన్ హర్షం
భోపాల్: మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాల సరళిపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్న భాజపాకే ప్రజలు మరోసారి పట్టం కట్టారన్నారు. మధ్యప్రదేశ్‌లో పాలనా బాధ్యతలను మరోసారి భాజపాకే అప్పగించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల సరళితో ఇది స్పష్టంగా అర్థమవుతోందన్నారు. భోపాల్‌లోని భాజపా కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ఆయన ఫలితాల్ని వీక్షిస్తున్నారు. ఫలితాలు భాజపాకు అనుకూలంగా ఉండడంతో స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం భాజపా 20 స్థానాలు, కాంగ్రెస్ 07, బీఎస్పీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
ఏడు నెలల క్రితం.. కమల్‌నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి.. భాజపా గూటికి సింధియా వర్గం చేరిన విషయం తెలిసిందే. దాని ఫలితంగా ఖాళీ అయిన 25 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో మరో 3 నియోజకవర్గాలు ఈ జాబితాలో చేరాయి. 230 సీట్లున్న మధ్యప్రదేశ్ శాసనసభలో ప్రస్తుతం భాజపాకు 107, కాంగ్రెస్‌కు 87మంది ఎమ్మెల్యేలున్నారు. సాధారణ ఆధిక్యాన్ని చేరుకోవాలంటే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని భాజపాకు మరో 8 సీట్లు దక్కితే చాలు. 28 స్థానాల్లో ఎక్కువచోట్ల కాంగ్రెస్ నెగ్గితే అసెంబ్లీలో తన బలాన్ని పెంచుకునే అవకాశముంటుంది. వీటిలో 27 చోట్ల ఇదివరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు.