రెఫరెండం పెట్టాకే తరలించండి: వైకాపా ఎంపీ

రాజధాని అమరావతిపై రెఫరెండం నిర్వహించాలని, వైకాపా ప్రజాప్రతినిధులకు రహస్య ఓటింగ్‌ పెట్టాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు డిమాండ్‌ చేశారు. అమరావతి విషయంలో సీఎం జగన్‌ ప్రజలను మోసగించారని..........

Published : 02 Aug 2020 00:59 IST

దిల్లీ: రాజధాని అమరావతిపై రెఫరెండం నిర్వహించాలని, వైకాపా ప్రజాప్రతినిధులకు రహస్య ఓటింగ్‌ పెట్టాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు డిమాండ్‌ చేశారు. అమరావతి విషయంలో సీఎం జగన్‌ ప్రజలను మోసగించారని దుయ్యబట్టారు. కీలకమైన బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో దిల్లీలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

‘‘అమరావతిలో పెద్ద ఇళ్లు, పార్టీ కార్యాలయం కట్టుకున్నప్పుడు చూసి రాజధాని పట్ల జగన్‌కు చిత్తశుద్ధి ఉందని నమ్మాను. ప్రజలందరూ కూడా దీన్నే విశ్వసించారు. అందుకే జగన్‌కు అద్భుతమైన విజయం వచ్చింది. అలాంటి ప్రజలను జగన్‌ నమ్మించి మోసం చేశారు. దక్షిణాఫ్రికాను చూసి విభజితమైన చిన్న రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టుకోవడమంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లే’’ అని రఘురామకృష్ణం రాజు విమర్శించారు.

‘‘కర్నూలు జుడీషియల్‌ క్యాపిటల్‌ అన్నంత మాత్రన అది రాజధాని అయిపోతుందా? అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేదే 45 రోజులు. అందులో ఒకసారి విశాఖలో నిర్వహిస్తామంటున్నారు. అలాంప్పుడు అమరావతి లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ ఎలా అవుతుంది?’’ అని ఎంపీ ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం వెనుక ఒకరు ఉన్నారని, ఆయనకు పూర్తి అధికారాలు కట్టబెట్టారని తప్పుబట్టారు. 3 రాజధానులపై రెఫరెండం నిర్వహించే వరకు రాజధాని తరలింపును వాయిదా వేయండి అని కోరారు. ప్రజలు మద్దతు ఇస్తే అప్పుడు ముందుకు వెళ్లండి అని హితవు పలికారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని