‘ఆ అనుమతులు సుప్రీంతీర్పునకు వ్యతిరేకం’

తెలంగాణ సచివాలయం కూల్చివేత ప్రాంతాన్ని పరిశీలించేందుకు వచ్చిన జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) బృందాన్ని ఎంపీ రేవంత్‌ రెడ్డి కలిశారు.

Updated : 10 Sep 2020 16:49 IST

ఎన్జీటీ బృందానికి ఎంపీ రేవంత్‌రెడ్డి ఫిర్యాదు

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయం కూల్చివేత ప్రాంతాన్ని పరిశీలించేందుకు వచ్చిన జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) బృందాన్ని ఎంపీ రేవంత్‌ రెడ్డి కలిశారు. లక్డీకాపూల్‌లోని అరణ్య భవన్‌లో బృందం సభ్యులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కొత్త సచివాలయ నిర్మాణం, అనుమతులపై వారికి ఫిర్యాదు చేశారు. కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు పలు శాఖలు ఇచ్చిన అనుమతులు సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమని కమిటీకి వివరించారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టుపక్కల ఒక కిలోమీటరు పరిధి వరకు ఎలాంటి శాశ్వత కట్టడాలకు అనుమతి ఇవ్వకూడదంటూ 2001లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని పలు నిపుణుల కమిటీలు ఇదే విధమైన నివేదికలు కూడా ఇచ్చినట్లు రేవంత్‌ తెలిపారు. 

2001 తర్వాత ఈ ప్రాంతంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదని రేవంత్‌ వివరించారు. తాజాగా పాత సచివాలయం స్థానంలో కొత్త సచివాలయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీనికి పలు శాఖల నుంచి అనుమతులు తెచ్చుకునే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇది 2001లో సుప్రీం ఇచ్చిన తీర్పునకు, పలు నిపుణుల కమిటీల నివేదికలకు వ్యతిరేకమని రేవంత్‌ అన్నారు. ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆయా శాఖల నుంచి వివరణ కోరి ఆ అనుమతులను రద్దు చేయాలని ఎన్జీటీ బృందానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ఈ ఉదయం ఐదుగురు సభ్యులతో కూడిన ఎన్జీటీ బృందం సచివాలయం ప్రాంతానికి చేరుకుని పరిశీలించింది. ఐఎఫ్‌ఎస్‌ అధికారి ఆర్‌ శోభ, శాస్త్రవేత్త ఎంటీ కృపయ్య, పర్యావరణ పరిరక్షణ చీఫ్‌ ఇంజినీర్‌ సీవై నగేశ్‌, ఐఐటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శశిధర్‌, చెన్నై పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ప్రాంతీయ సంచాలకులు పూర్ణిమ ఎన్జీటీ బృందంలో సభ్యులుగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని