అమిత్‌ షా రాజీనామాకు దీదీ డిమాండ్‌!

పశ్చిమ్ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జరుగుతోన్న నాలుగోదశ పోలింగ్‌ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.

Updated : 10 Apr 2021 16:41 IST

ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని మమత డిమాండ్‌

కోల్‌కతా: పశ్చిమ్ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జరుగుతోన్న నాలుగోదశ పోలింగ్‌ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కూచ్‌బెహార్‌లోని సీతల్‌కుచ్‌లో ఓటువేయడానికి క్యూలో నిల్చున్నవారిని భద్రతా బలగాలు కాల్పిచంపాయని ఆరోపిస్తూ.. తృణమూల్ అధినేత్రి,  సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భయాలే నిజమయ్యాయంటూ కేంద్రంపై మండిపడ్డారు. 

‘భద్రతా బలగాలపై కేంద్ర హోంశాఖ ప్రభావం ఉందని మేం ముందునుంచి చెప్తున్నాం. ఇప్పుడు మా భయాలే నిజమయ్యాయి. ఆ బలగాల చేతిలో ఐదుగురు మరణించారు. ఎందుకు అన్ని మరణాలు సంభవించాయో హోంమంత్రి అమిత్‌ షా సమాధానం చెప్పాలి. ఇంతమందిని చంపిన తరవాత కూడా..ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు వారు (ఎన్నికల సంఘం) చెప్పడం సిగ్గుచేటు. అదంతా అబద్ధం’ అని హింగల్ గంజ్‌ ఎన్నికల ప్రచారంలో మమత విరుచుకుపడ్డారు. ఓటమిని ముందుగానే గుర్తించిన భాజపా ఈ కుట్రలకు పాల్పడుతుందన్నారు. 

‘అయినా సరే, ప్రజలంతా ప్రశాంతంగా ఉండి..శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకోమని కోరుతున్నాను. వారిని ఓడించి, మరణాలకు ప్రతీకారం తీర్చుకోండి. ఇప్పటికి దాదాపు 18 మరణాలు చోటుచేసుకుంటే..అందులో 12 మంది తృణమూల్‌కు చెందినవారే. ఈ ఘటనపై ప్రజలకు ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలి’ అని మమత డిమాండ్ చేశారు. ఇప్పుడు బాధ్యత అంతా ఎన్నికల సంఘానిదేనని గుర్తుచేశారు. ఇదిలా ఉండగా..కూచ్‌బెహార్‌లోని ఘటనా స్థలానికి మమత రేపు వెళ్లనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని