రాజస్థాన్‌లో రాష్ట్రపతి పాలనకు డిమాండ్‌..!

రాజస్థాన్‌ రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. భాజపా నేతలు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించినట్లుగా పేర్కొంటూ...

Published : 18 Jul 2020 22:08 IST

లఖ్‌నవూ: రాజస్థాన్‌ రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. భాజపా నేతలు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించినట్లుగా పేర్కొంటూ ఆడియో టేపులు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ ఫిరాంయింపుల వ్యతిరేక చట్టాన్ని ఉల్లఘించి అశోక్‌ బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని ఆరోపించారు. అలానే ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఆయన చట్టవ్యతిరేకంగా వ్యవహరించారని ట్విటర్లో పేర్కొన్నారు. ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రస్తుతం రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన, అస్థిరత గురించి ఆ రాష్ట్ర గవర్నర్‌ పూర్తిగా తెలుసుకోవాలి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలి’’ అని ట్విటర్‌ వేదికగా మాయావతి డిమాండ్ చేశారు.

అశోగ్ గహ్లోత్‌ నేతృత్వలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించారని రాజస్థాన్‌ పీసీసీ అధ్యక్షుడు మహేష్ జోషి స్పెషల్ ఆపరేషన్ గ్రూప్‌ (ఎస్‌ఓజీ) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. అంతకు ముందు తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్ర మంత్రి, భాజపా నేత గజేంద్ర సింగ్ షెకావత్ కుట్ర పన్నారని ఆరోపిస్తూ పలు ఆడియో టేపుల సంభాషణలను కాంగ్రెస్‌ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో కాంగ్రెస్ తనపై అసత్య ఆరోపణలు చేస్తోందనీ, ఎలాంటి విచారణకైనా సిద్ధమనీ మంత్రి ప్రకటించారు. అలానే రాజస్థాన్‌ ముఖ్యమంత్రి నివాసం నకిలీ ఆడియోలకు నిలయంగా మారిందని భాజపా ఆరోపించింది. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని