ముఫ్తీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి గరంగరం

జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక అధికారాలను రద్దు చేస్తూ కేంద్రం చేసిన రాజ్యాంగపరమైన మార్పులను వెనక్కి తీసుకొనే వరకు జాతీయ పతాకాన్ని పట్టుకోనంటూ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలపై భాజపా......

Published : 25 Oct 2020 02:11 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక అధికారాలను రద్దు చేస్తూ కేంద్రం చేసిన రాజ్యాంగపరమైన మార్పులను వెనక్కి తీసుకొనే వరకు జాతీయ పతాకాన్ని పట్టుకోనంటూ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. ఈ మేరకు కేంద్రమంత్రి, భాజపా సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ ఆమె తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ సీఎంగా పనిచేసిన ముఫ్తీ త్రివర్ణ పతాకాన్ని అగౌరవపరిచేలా మాట్లాడారని, ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా కశ్మీర్‌కు గతంలో ఉన్న అధికారాల తొలగింపు చేపట్టామని, దీనికి పార్లమెంట్‌ ఉభయ సభలూ ఆమోదం తెలిపాయని రవిశంకర్‌ అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు చేయడంపై దేశ ప్రజలు హర్షం వ్యక్తంచేశారన్నారు.

చిన్నచిన్న వాటికే భాజపాను విమర్శించే ప్రతిపక్ష పార్టీలు జాతీయ జెండాను అగౌరవపరిచేలా మాట్లాడిన ముఫ్తీ వ్యాఖ్యలపై ఎందుకు మౌనం దాల్చాయని రవిశంకర్‌ ప్రశ్నించారు. ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌లో అభివృద్ధి జరుగుతోందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మహిళలకు మేలు కలుగుతోందని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించే వరకు తాను త్రివర్ణ పతాకాన్ని పట్టుకోనంటూ ముఫ్తీ శుక్రవారం వ్యాఖ్యానించారు. తనకు ఎన్నికల్లో పోటీచేసే ఆసక్తి కూడా లేదని ముఫ్తీ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని