ఓటమి భయం మీకా?మాకా?: తలసాని

రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోయినా రాష్ట్ర భాజపా నేతలు మాత్రం గొప్పలు చెబుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు.

Published : 28 Oct 2020 00:57 IST

హైదరాబాద్‌: రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోయినా రాష్ట్ర భాజపా నేతలు మాత్రం గొప్పలు చెబుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. కేసీఆర్‌ కిట్, కల్యాణలక్ష్మి, రైతుబంధు పథకాల్లో కేంద్రం వాటా ఉందని దుబ్బాకలో భాజపా నేతలు ప్రచారం చేస్తున్నారని.. ఈ పథకాల్లో ఒక్కరూపాయైనా వాటా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వంతో అధికారిక ప్రకటన చేయించాలని డిమాండ్‌ చేశారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. దివంగత రామలింగారెడ్డి అందించిన సేవలే దుబ్బాకలో తమ పార్టీకి విజయాన్ని చేకూరుస్తాయని తలసాని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో సోమవారం జరిగిన పరిణామాలు, భాజపా నేతల వ్యవహారశైలిపై తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో ప్రచారం కోసం ప్రణాళిక ప్రకారమే సిద్దిపేటలో భాజపా హడావుడి చేసిందని ఆరోపించారు. దొంగతనం మీరు చేసి వేరే వాళ్లపై నెడతారా? అని భాజపాను ఉద్దేశించి తలసాని వ్యాఖ్యానించారు. నిన్న జరిగిన ఘటనపై సిద్దిపేట సీపీ వీడియో విడుదల చేయకపోతే ప్రజల్లో చాలా అనుమానాలు వచ్చేవన్నారు. 

ఏం.. మాకు మాట్లాడటం రాదా?

‘‘ఎన్నిక ప్రచారం చివరి దశకు వస్తున్నా తెరాస నుంచి మంత్రులు, ముఖ్యనేతలు ఎవరైనా దుబ్బాక ప్రచారానికి వెళ్లారా? జిల్లా మంత్రి, స్థానిక నేతలు మాత్రమే వెళ్లారు. భాజపా మాత్రం రాష్ట్రంలోని అందరు నేతలను తీసుకెళ్లింది. కాంగ్రెస్‌ అయితే మండలానికి ఒక ముఖ్యనేతకు బాధ్యత అప్పగించింది. భాజపా నేతలు నిన్నటి నుంచి సీఎం అనే గౌరవం కూడా లేకుండా ఏకవచనంతో మాట్లాడుతున్నారు. ఏం మాకు మాట్లాడటం రాదా? బాధ్యతగా ఉండాలనే ఉద్దేశం తప్ప మీకంటే ఎక్కువ మాట్లాడగలం. తెరాస కార్యకర్తల సంఖ్య ఎంత? మీరున్నదెంత? అసలు మీరు దేనికి సరిపోతారు? దీనిపై ఓసారి ఆలోచించుకోవాలి. ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఇది ప్లాట్‌ఫామా? అధికారులను కించపరిచేలా మాట్లాడతారా? ఇంత బాధ్యతా రాహిత్యమా? బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌ పోలీసు బందోబస్తు లేకపోతే బయటకు వెళతారా? బాధ్యత గల కేంద్రమంత్రి ఏం జరిగిందో విచారణ చేసి తెలుసుకుని వెళ్లాలి కదా? మీకంటే నాలుగు ఆకులు ఎక్కువే తప్ప.. ఎవరూ తక్కువ లేదిక్కడ. మీ ప్రచారం మీరు చేసుకోండి. మా ప్రచారం మేం చేసుకుంటాం.. అంతిమంగా ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఉప ఎన్నిక ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతోందా? రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనా? దుబ్బాకలో ఇదే భాజపా అభ్యర్థికి రెండుసార్లు డిపాజిట్‌ రాలేదు. పార్లమెంట్ ఎన్నికలోనూ అదే పరిస్థితి. ఓటమి భయం కనిపిస్తోంది మీకా?మాకా? అవకాశం వచ్చింది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మీకే భవిష్యత్‌ ఉండదు’’ అని భాజపా నేతలపై తలసాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని