పూర్తయిన లక్ష ఇళ్లను భట్టికి చూపిస్తాం:తలసాని

నగర పరిధిలో రెండు పడక గదుల ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పరిశీలించారు

Published : 17 Sep 2020 15:53 IST

హైదరాబాద్‌: నగర పరిధిలో రెండు పడక గదుల ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పరిశీలించారు. నిన్న శాసనసభలో చర్చ సందర్భంగా హైదరాబాద్‌లో లక్ష ఇళ్ల నిర్మాణంపై ఇరువురు నేతల మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. జీహెచ్‌ఎంసీలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకు వస్తాయని భట్టి విమర్శించారు. రాష్ట్ర రాజధానిలో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎక్కడ నిర్మించారో చెప్పాలని సవాల్‌ విసిరారు. భట్టి సవాల్‌ను స్వీకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నిర్మాణాలను స్వయంగా చూపిస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరువురూ ఈరోజు నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం నేతలిద్దరూ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.

పేదవాడు కూడా గొప్పగా బతకాలనే ఆలోచన కలిగిన సీఎం కేసీఆర్‌ అని.. ఆయనే స్వయంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు రూపకల్పన చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ అన్నారు. ఇప్పటి వరకు పరిశీలించిన ఇళ్లు చాలా తక్కువని.. ఇంకా ఇలాంటివి 60 ప్రాంతాలున్నాయన్నారు. రసూల్‌పుర, ముషీరాబాద్‌, అంబర్‌పేట, పాతబస్తీ, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. రేపు కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌ జవహర్‌నగర్‌, ఎల్బీనగర్‌, కొల్లూరు ప్రాంతాల్లో పరిశీలిస్తామని చెపన్పారు.  ఒక్కో డబుల్‌ బెడ్‌రూం ఇల్లు విలువ రూ.కోటి ఉంటుందన్నారు. వీటిపై మంత్రి కేటీఆర్‌ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ఇళ్లను పేదలకు పంపిణీ చేస్తామన్నారు. పూర్తయిన లక్ష ఇళ్లను భట్టికి చూపిస్తామని వ్యాఖ్యానించారు.

ఈరోజు 3,428 ఇళ్లు పరిశీలించాం: భట్టి

అంతకుముందు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈరోజు జియాగూడ, కట్టెలమండి, ఇందిరాగాంధీ కాలనీ, మారేడుపల్లి ప్రాంతాల్లో డబుల్‌బెడ్‌రూం ఇళ్లను పరిశీలించామన్నారు. ఇప్పటి వరకు 3,428 ఇళ్లను చూశామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇళ్ల పేదలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి చెప్పారని.. రేపు కూడా మరికొన్ని ప్రాంతాల్లో పరిశీలిస్తామన్నారు. ఆయా ప్రాంతాల్లో తిరిగిన తర్వాత పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని చెప్పారు. రాజీవ్‌ స్వగృహ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు మధ్య తేడాను ప్రజలనే అడిగి తెలుసుకోవాలని ఓ ప్రశ్నకు సమాధానంగా భట్టి చెప్పారు. ఇళ్ల నాణ్యతపై ఇంజినీరింగ్‌ బృందం నుంచి వివరాలు తీసుకుంటాన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని