రథం దగ్ధంపై జగన్‌ స్పందించాలి:రఘురామ

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి రథం కాలిపోయిన విధానం చూస్తుంటే కుట్ర ప్రకారమే జరిగినట్లు అనుమానంగా ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.

Updated : 06 Sep 2020 15:51 IST

దిల్లీ: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి రథం కాలిపోయిన విధానం చూస్తుంటే కుట్ర ప్రకారమే జరిగినట్లు అనుమానంగా ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై సీఎం జగన్‌ స్వయంగా స్పందించాలని ఆయన కోరారు. దీన్ని మతిస్థితిమితం లేని వ్యక్తి చేసిన చర్యగా వదిలేయకుండా డీజీపీతో ప్రత్యక్షంగా మాట్లాడాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణరాజు సూచించారు.

శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో అంతర్వేది ఆలయం షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది. అయితే రథానికి మంటలు అంటుకోవడం ప్రమాదవశాత్తు జరిగిందా? ఆకతాయిల పనా? అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 40 అడుగులు ఉన్న ఈ రథాన్ని 60 ఏళ్ల క్రితం టేకు కలపతో తయారు చేశారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలి:అఖిల భారత హిందూ మహాసభ

అంతర్వేది ఆలయంలో రథం దగ్ఢం ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలభారత హిందూ మహాసభ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు అఖిల భారత హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి జీవీఆర్‌ శాస్త్రి లేఖ రాశారు.  ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని అమిత్‌షాను ఆయన కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని