మోదీయే మాకు పెద్ద స్టార్..

మహారాష్ట్ర మాజీ సీఎం, భాజపా సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీయే తమకు పెద్ద సూపర్‌ స్టార్‌ అని, భాజపాకు మరే ఇతర స్టార్‌లూ........

Published : 14 Sep 2020 18:36 IST

బిహార్‌లో కంగన ప్రచారంపై ఫడణవీస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కతిహార్‌ (బిహార్‌): మహారాష్ట్ర మాజీ సీఎం, భాజపా సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీయే తమకు పెద్ద సూపర్‌స్టార్‌ అని, భాజపాకు మరే ఇతర స్టార్‌లూ అవసరం లేదని వ్యాఖ్యానించారు. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ బిహార్‌ ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున ప్రచారం చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు.  సోమవారం ఆయన బిహార్‌లోని కతియార్‌లో భాజపా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఫడణవీస్‌ మాట్లాడుతూ.. ‘‘మాకు ఏ స్టార్‌లూ అవసరం లేదు. నరేంద్ర మోదీయే భాజపాకు అతి పెద్ద స్టార్‌.. దేశానికి ఆయనే సూపర్‌ స్టార్‌. ఆయన వల్లే దేశంలో గెలిచాం.. ఎక్కడైనా గెలుస్తాం’’ అని వ్యాఖ్యానించారు. ఇటీవల ముంబయి మహా నగరాన్ని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోలుస్తూ కంగనా రనౌత్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారానికి కారణమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన- కంగనా రనౌత్‌ తీవ్ర వాగ్యుద్ధం కొనసాగింది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో ముంబయిలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆమె కార్యాలయం అక్రమ కట్టడమంటూ బీఎంసీ అధికారులు కూల్చివేయడంతో ఈ వివాదం మరింతగా ముదిరింది. అయితే, కంగన ముంబయి గురించి చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించబోనన్న ఫడణవీస్‌.. ఆమె కార్యాలయాన్ని కూల్చడాన్ని మాత్రం తప్పుబట్టారు. కంగన కార్యాలయాన్ని కూల్చిన అధికారులు.. మరి దావూద్‌ ఇంటిని కూల్చలేదెందుకని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై కాకుండా కంగనపై పోరాడుతోందంటూ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని