Sidhu: పీసీసీ చీఫ్‌గా సిద్ధూ రాజీనామా

పంజాబ్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి.....

Updated : 28 Sep 2021 16:12 IST

చండీగఢ్‌: పంజాబ్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్‌ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. రాజీపడితే వ్యక్తిత్వం కోల్పోయినట్లేనని పేర్కొన్నారు. పంజాబ్‌ భవిష్యత్తు, సంక్షేమం అజెండాలో మాత్రం  రాజీపడే ప్రసక్తేలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో కార్యకర్తగా కొనసాగుతానని స్పష్టంచేశారు. ఈ లేఖను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. పీసీసీ పదవి చేపట్టిన రెండున్నర నెలలకే రాజీనామా చేయడం గమనార్హం. పంజాబ్‌ మంత్రివర్గ విస్తరణ తర్వాత సిద్ధూ ఈ నిర్ణయం తీసుకోవడంతో దీనిపై అసంతృప్తితోనే పీసీసీ చీఫ్‌ పదవికి రాజీనామా చేసినట్టు ఊహాగానాలు వస్తున్నాయి.

సిద్ధూకు పీసీసీ పదవిని కట్టబెట్టడంపై తొలి నుంచీ మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల ఆయనపై తీవ్ర ఆరోపణలు కూడా చేసిన విషయం తెలిసిందే. దేశానికి, పంజాబ్‌కు సిద్ధూ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితమే దిల్లీకి వెళ్లిన అమరీందర్‌ సింగ్‌ ఈరోజు భాజపా అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్‌షాను కలిసే ఉంది. ఆయన భాజపాలో చేరతారని కూడా ఊహాగానాలు చెలరేగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. గత కొన్ని నెలలుగా సిద్ధూ, అమరీందర్‌ సింగ్‌ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తడంతో పంజాబ్‌ కాంగ్రెస్‌లో, రాష్ట్ర ప్రభుత్వంలో తీవ్ర సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో పంజాబ్‌ పీసీసీ చీఫ్‌గా సిద్ధూని నియమించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం.. ఆ తర్వాత పంజాబ్‌ సీఎంగా కెప్టెన్‌ను మార్చడం.. ఆయన స్థానంలో సిద్ధూకి సన్నిహితుడిగా ఉన్న దళిత నేత చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీని కొత్త సీఎంగా నియమించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు మరింతగా పెరిగాయి.

సిద్ధూ రాజీనామాపై అమరీందర్‌ ట్వీట్‌!

పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా సిద్ధూ రాజీనామాపై కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ స్పందించారు. సిద్ధూకి స్థిరత్వంలేదని ముందే చెప్పాగా అని పేర్కొన్నారు. పంజాబ్‌ వంటి సరిహద్దు రాష్ట్రానికి సిద్ధూ సరికాదన్నారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని