దమ్ముంటే ఆ అంశాలపై మాట్లాడండి: తేజస్వి

బిహార్‌లో ఎన్నికల వేడి కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే తొలివిడత పోలింగ్‌ ముగియగా..రెండో విడత ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. నిరుద్యోగం, ఉపాధికల్పన, వలసవాదంపై మాట్లాడాలని...

Published : 31 Oct 2020 00:56 IST

పట్నా: బిహార్‌లో ఎన్నికల వేడి కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే తొలివిడత పోలింగ్‌ ముగియగా..రెండో విడత ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. నిరుద్యోగం, ఉపాధికల్పన, వలసవాదంపై మాట్లాడాలని సవాల్‌ విసిరారు. ఈమేరకు ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘‘తాను అధికారంలో ఉన్న గత 15 ఏళ్లలో రాష్ట్రంలో విద్య,  వైద్యం పరిశ్రమలు పూర్తిగా నాశనమయ్యాయని, ప్రజల భవిష్యత్తును గంగలో కలిపేశానని’’ ముఖ్యమంత్రి నీతీశ్‌ ఒప్పుకున్నారని అన్నారు. అందుకే ఆయన ఆయా అంశాలపై మాట్లాడటం లేదని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం, అవినీతి తదితర అంశాలపై మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

‘కుమారుడి కోసం తపన వల్లే వారికి తొమ్మది మంది సంతానం’ అని నితీశ్‌ వ్యక్తిగత విమర్శలు చేశారని గుర్తు చేస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీకి ఆరుగురు తోబుట్టువులున్న సంగతి మర్చిపోయారా? అని తేజస్వి ప్రశ్నించారు. మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధాన సమస్యలపై మాట్లాడకుండా ఎదుటి వారిని కించపరిచేలా మాట్లాడటం సరి కాదన్నారు. సీఎం నితీశ్‌కుమార్‌ ఎన్ని విమర్శలు చేసినా అవి ఆర్జేడీకి ఆశీస్సులుగా పని చేస్తాయని పునరుద్ఘాటించారు. మరోవైపు యువతకి ఉపాధి కల్పనే తమ ధ్యేయమని తేజస్వి అన్నారు. పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు స్థాపిస్తామని చెప్పారు. సమస్యలను పరిష్కరించే వారికే బిహార్‌ ప్రజలు ఓట్లు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 243 స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్‌ నిర్వహిస్తుండగా.. 28న తొలి విడత పోలింగ్‌ ముగిసింది. 55.69 శాతం ఓట్లు పోలయ్యాయి. రెండో విడత పోలింగ్‌ నవంబర్‌ 3న జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని