అవన్నీ బోగస్‌ మాటలే: నితీశ్‌

బిహార్‌ ఎన్నికల్లో నిరుద్యోగ సమస్య కీలక ప్రచారాస్త్రంగా మారింది. అధికార, విపక్ష కూటముల మధ్య ఇదే అంశంపై మాటల యుద్ధం కొనసాగుతోంది. మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌పై తాము అధికారంలోకి వస్తే తొలి కేబినెట్‌ సమావేశంలోనే ...........

Updated : 30 Oct 2020 20:02 IST

పట్నా: బిహార్‌ ఎన్నికల్లో నిరుద్యోగ సమస్య కీలక ప్రచారాస్త్రంగా మారింది. అధికార, విపక్ష కూటముల మధ్య ఇదే అంశంపై మాటల యుద్ధం కొనసాగుతోంది. తాము అధికారంలోకి వస్తే తొలి కేబినెట్‌ సమావేశంలోనే 10లక్షల ఉద్యోగాల కల్పనపై నిర్ణయం తీసుకుంటామన్న మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ హామీపై జేడీయూ అధినేత, సీఎం నితీశ్‌ కుమార్‌ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 10లక్షల ఉద్యోగాల హామీ వట్టి బోగసేనని విమర్శించారు. ఇలాంటి మాటలతో ప్రజల్ని తప్పుదారి పట్టించి అయోమయంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. శుక్రవారం పర్బట్టాలోని ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడిన నితీశ్‌.. గత ఆర్జేడీ పాలనను ఎండగట్టారు. లాలూ హయాంలో రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల మహిళలు నిర్లక్ష్యానికి గురయ్యారని విమర్శించారు. గతంలో మహిళల పరిస్థితి అధ్వాన్నంగా ఉండేదన్నారు. వారి సమస్యలను ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. జేడీయూ అధికారంలోకి వచ్చాక మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు. మహిళలను అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
ఓటు ముందు.. తర్వాతే వంట!
గ్రామీణ మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించడమే లక్ష్యంగా ‘జీవిక’ వంటి ప్రాజెక్టులు తీసుకొచ్చామని నితీశ్ తెలిపారు. బిహార్‌ అభ్యున్నతిలో మహిళల భాగస్వామ్యం ఎంతో ఉందని, నవంబర్‌ 3న జరిగే రెండో దశ ఎన్నికల్లో మహిళలు ఓటు ముందు వేసి ఆ తర్వాత వంట చేసుకోవాలని సూచించారు. గతంలో నగరాలకు కూడా విద్యుత్‌ ఉండేది కాదన్న ఆయన.. లాంతరు (ఆర్జేడీ ఎన్నికల గుర్తు) పాలన అంతమయ్యాక ప్రజల ఇంటికి విద్యుత్‌ వెలుగులు తీసుకొచ్చామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బిహార్‌కు మరిన్ని ప్రాజెక్టులు ఇచ్చారని, ప్రజలు ఎన్డీయే కూటమికి మరో అవకాశం కల్పిస్తే రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లేలా పనిచేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని