బిహార్‌ పీఠంపై ఏడోసారి.. ‘వికాస్‌ పురుష్‌’

బిహార్‌ ప్రజలు నిష్కళంక నీతీశ్‌కే మళ్లీ పట్టం కట్టారు. దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నా అవినీతి మకిలి అంటని వికాస్‌ పురుష్‌ వైపే నిలిచారు. గత ఎన్నికల్లో ఆర్జేడీతో జతకట్టి మహాకూటమిగా బరిలోకి దిగినా.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఎన్డీయేలో చేరి తాజాగా ఎన్నికల సమరంలోకి దూకినా.. .........

Published : 17 Nov 2020 01:38 IST

సంకీర్ణాల చాణక్యుడికే మళ్లీ పట్టం 

వరుసగా నాలుగోసారి.. మొత్తంగా ఏడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం

ఇంటర్నెట్‌ డెస్క్ ప్రత్యేకం‌: బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. జేడీయూ అధినేత నీతీశ్‌ కుమారే మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నా.. అవినీతి మకిలి అంటని వికాస్‌ పురుష్‌ సారథ్యంలోని ఎన్డీయే వైపే జనం నిలవడంతో మరోసారి ఆయన సీఎం పీఠాన్ని అధిష్టించారు. ఈ ఎన్నికల్లో 43 స్థానాలతో జేడీయూ మూడో స్థానంలో నిలిచినప్పటికీ భాజపా నీతీశ్‌కే సీఎం పదవి అప్పగించాల్సి రావడం ఆయన ప్రత్యేకతనే చెప్పాలి. అందుకే ఆయన్ను రాజకీయ వ్యూహాల్లో ఆధునిక చాణక్యుడిగా చెప్పుకొంటారు. గత కొన్ని దశాబ్దాల కాలంలో బిహార్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2000 సంవత్సరం నుంచి ఆరుసార్లు నీతీశ్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా.. ఇది ఏడోసారి కావడం విశేషం. గత ఎన్నికల్లో ఆర్జేడీతో జట్టుకట్టి మహా కూటమిగా బరిలోకి దిగినా.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఎన్డీయేలో చేరి తాజాగా ఎన్నికల సమరంలోకి దూకినా నీతి, నిజాయతీతో అరుదైన వ్యక్తిత్వం కలిగిన నీతీశ్‌దే పైచేయి అయింది. 20 ఏళ్లలో 7సార్లు సీఎంగా ప్రమాణం చేసి దేశ రాజకీయాల్లోనే అరుదైన అధ్యాయం లిఖించిన నీతీశ్‌ రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం..

విరోధులు కూడా వెలెత్తి చూపలేని వ్యక్తిత్వం..

నీతీశ్‌ది నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం. కేంద్రమంత్రిగా, బిహార్‌ సీఎంగా ఇన్నాళ్లపాటు ప్రజా జీవితంలో ఉన్నా అవినీతి మరకలు ఏమాత్రం అంటని అరుదైన రాజకీయ నాయకుడాయన. రాజకీయ విరోధులు సైతం ఈ విషయంలో ఆయన్ను వేలెత్తి చూపే ధైర్యం చేయలేనంతటి నిజాయతీ ఆయన సొంతం.  నమ్మిన విలువలను పాటించడంలో ఎంత కఠినంగా ఉంటారో.. రాజకీయ వ్యూహాలను అమలుచేసి ప్రత్యర్థులను చిత్తుచేయడంలోనూ అంతే సమర్థతతో వ్యవహరిస్తారు. గత 20 ఏళ్ల పాలనలో ఆయనపై ఒక్క అవినీతి ఆరోపణ రాకపోవడం మరో విశేషం.  1999లో ఆయన కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఓ రైలు ప్రమాదంలో 300 మంది చనిపోతే.. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవడం ఆయనలోని నైతిక విలువలకు నిదర్శనం. భాజపాతో దాదాపు 20 ఏళ్ల బంధాన్ని సైద్ధాంతిక కారణాలతో వదులుకున్నా.. ఆ తర్వాత ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నీతీశ్‌.. పరిస్థితుల ప్రభావంతో మహాకూటమిని వీడి మళ్లీ ఎన్డీయేతోనే చేతులు కలిపి బిహార్‌ను అభివృద్ధి పథం వైపు నడిపించడంలో కృషిచేసి ప్రజల మెప్పును పొందారు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించని చెప్పిన ఆయన‌.. తన ఒక్కగానొక్క కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురాకపోవడం కూడా ఆయనలోని మరో విశేషం. 

ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి..

నీతీశ్‌ రాజకీయ జీవితం 45 ఏళ్ల క్రితం విద్యార్థి సంఘాలతో మొదలైంది. నాటి ప్రముఖ నేత జయప్రకాశ్‌ నారాయణ్‌ (జేపీ) ప్రారంభించిన దేశ వ్యాప్త ఉద్యమంలోనూ చురుకైన పాత్ర పోషించారు. జేపీ, రాం మనోహర్‌ లోహియా, ఎస్‌ఎస్‌ సిన్హా, కర్పూరీ ఠాకూర్‌ వంటి సోషలిస్టు దిగ్గజాల నుంచి రాజకీయాలు నేర్చుకున్నారు. చదువులోనూ ముందుండేవారు. బిహార్‌ ఇంజినీరింగ్ కళాశాల (ప్రస్తుతం పట్నా- నిట్‌) నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో పట్టా తీసుకున్న నీతీశ్‌.. ఆ తర్వాత రాష్ట్ర విద్యుత్‌బోర్డులో కొంత కాలం పాటు ఉద్యోగం చేశారు. కానీ, రాజకీయాల పట్ల ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలుత రెండు సార్లు ఓటమి చవిచూసినా వెనుకడుగు వేయలేదు. 1985లో జరిగిన ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో తొలిసారి అడుగు పెట్టారు. 

కేంద్ర రాజకీయాల్లోనూ తనదైన ముద్ర 

జనతాదళ్‌లో అంచెలంచెలుగా ఎదుగుతున్న దశలో నీతీశ్‌.. లాలూ ప్రసాద్‌ ఒంటెత్తుపోకడలు నచ్చక సీనియర్‌ నేత జార్జి ఫెర్నాండేజ్‌తో కలిసి బయటకు వచ్చి సమతా పార్టీని స్థాపించారు. ఈపార్టీ 1996 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీ చేసింది. అనంతర కాలంలో శరద్‌యాదవ్‌ జనతాదళ్‌ వర్గం, సమతా పార్టీ, రామకృష్ణ హెగ్డే నేతృత్వంలో లోక్‌శక్తి కలిసి 2003లో జనతాదళ్‌ యునైటెడ్‌ పార్టీగా ఏర్పాటైంది. లాలూతో విభేదాల నేపథ్యంలో నీతీశ్‌ దిల్లీ రాజకీయాలపై దృష్టిసారించారు. 1989లో తొలిసారి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 1991, 96, 98, 99, 2004లలో సాధారణ ఎన్నికల్లో వరుస విజయాలతో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 1998-99లో వాజ్‌పేయీ ప్రధానిగా భాజపా నేతృత్వంలో ఏర్పాటైన సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి పదవిని చేపట్టారు. అనంతరం రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1999లో బెంగాల్‌లో రైలు ప్రమాదం నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు.  2001-04లో మళ్లీ వాజ్‌పేయీ నేతృత్వంలో నీతీశ్ రైల్వే మంత్రిగా పనిచేశారు. ఇంటర్నెట్ ద్వారా రైల్వే టికెట్లు బుకింగ్‌, తత్కాల్‌ సేవలు, పెద్ద సంఖ్యలో రైల్వే బుకింగ్‌ కేంద్రాల ఏర్పాటు వంటి సంస్కరణలు ప్రవేశపెట్టారు. 2002లో గుజరాత్‌లో గోద్రా రైలు ఘటన, అనంతర హింసాకాండ నీతీశ్‌ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు జరిగినవే. 2004లో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ఓటమిపాలైన తర్వాత నితీశ్‌ తన స్వరాష్ట్రం బిహార్‌పై దృష్టిపెట్టారు. అప్పటికే జనతాదళ్‌కు చెందిన వివిధ వర్గాలన్నీ కలిసి జేడీయూగా ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో రబ్రీదేవి పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిపారు. 2005లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ భాజపాతో కలిసి అధికారంలోకి రావడంతో.. నీతీశ్‌ సీఎంగా ఎన్నికయ్యారు. 

వికాస్‌ మంత్రంతో ఆర్జేడీని దెబ్బకొట్టి..

ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి, శాంతిభద్రతలకు నీతీశ్‌ ప్రాధాన్యం ఇచ్చారు. అప్పటివరకు చెలరేగిన రౌడీ నేతలను ఉక్కుపాదంతో అణచివేశారు. బడ్జెట్‌లో ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసి కేటాయింపులు జరిపారు. ప్రభుత్వ సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు నిజాయతీగా సేవలందించేలా కృషిచేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపి బిహార్‌ వికాస్‌ పురుష్‌గా పేరు తెచ్చుకున్నారు. ఓ వైపు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూనే రాజకీయాల్లో కొత్త సమీకరణలు రచించారు. లాలూకు బీసీల్లో, దళితుల్లో గట్టి మద్దతు ఉన్న దృష్ట్యా ఆయన పునాదిని సడలించడం కోసం మహా దళితులు, అత్యంత వెనుకబడిన వర్గాలు అంటూ రెండు వర్గాలను సృష్టించారు. ఈ నిరుపేదల కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలుచేసి వారి అభిమానం సంపాదించుకున్నారు. లాలూకు చెందిన ఆర్జేడీ పార్టీ పునాదిని నీతీశ్‌ దెబ్బతీశారు. 

చిరకాల శత్రువు లాలూతోనూ దోస్తీ

భాజపాతో సుదీర్ఘ బంధానికి 2013లో నీతీశ్‌ తెగదెంపులు చేసుకున్నారు. భాజపా లోక్‌సభ ఎన్నికల ప్రచార సారథిగా నాటి గుజరాత్ సీఎం మోదీని ఎంపికచేసినందుకు నిరసన వ్యక్తంచేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి భాజపా బయటకు వచ్చేసింది. అనంతరం 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో  మోదీ ప్రభంజనంతో భాజపా కూటమి బిహార్‌లో సంచలన విజయాన్నిసాధించింది. మొత్తం 40 స్థానాలకు గాను భాజపా 22,  మిత్రపక్షాలు 9సీట్లు గెలుచుకున్నాయి. నీతీశ్‌ నేతృత్వంలోని జేడీయూ మాత్రం కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. దీంతో షాకైన నీతీశ్‌.. తన సీఎం పదవికి రాజీనామా చేసి మహాదళిత వర్గానికి చెందిన జితిన్‌రాం మాంఝీని నియమించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరపడుతున్న కొద్దీ మాంఝీ నేతృత్వంలో పార్టీ విజయం కష్టమని గుర్తించిన ఆయన.. మాంఝీని తప్పుకోవాలని సూచించారు. ఇందుకు మాంఝీ నిరాకరించడంతో పార్టీ నుంచి తొలగించి 2015 ఫిబ్రవరిలో తిరిగి సీఎం పదవిని చేపట్టారు. అనంతరం 2015లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ప్రత్యర్థి మోదీని ఎదుర్కొనేందుకు తన చిరకాల శత్రువు లాలూకు స్నేహ హస్తం అందించి అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడి విజయ దుందుభి మోగించారు. 

గతంలో ఆరు సార్లు సీఎం ఎలాగంటే..?

2000 మార్చి నెలలో వారం రోజుల పాటు నీతీశ్‌ సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత 2005లో భాజపాతో పొత్తు పెట్టుకొని బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2010లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండో సారి విజయం సాధించి మూడో సారి సీఎంగా ప్రమాణం చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన సీఎం పదవికి రాజీనామా చేసిన నీతీశ్.. ఆ పదవిలో దళిత నేత జితన్‌రాం మాంఝీని నియమించారు. అనంతరం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా మాంఝీ నేతృత్వంలో గెలిచే అవకాశం లేదని భావించిన ఆయన.. మాంఝీని పదవి నుంచి తప్పుకోవాలని కోరగా.. అందుకు ఆయన నిరాకరించారు. దీంతో మాంఝీని పార్టీ నుంచి బహిష్కరించి నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2015 అసెంబ్లీ ఎన్నికల్లో చిరకాల శత్రువైన ఆర్జేడీతో చేతులు కలిపి మహాకూటమిగా ఏర్పడి భాజపాపై విజయం సాధించారు. అప్పుడు కూడా ఆర్జేడీ కన్నా జేడీయూకి తక్కువ స్థానాలే దక్కినప్పటికీ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నిష్కళంకుడైన నీతీశ్‌కే సీఎం పగ్గాలు అప్పగించారు. 2017లో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌పై ఆరోపణల నేపథ్యంలో మహాకూటమి ప్రభుత్వంలో చీలిక వచ్చింది. తేజస్వీని రాజీనామా కోరగా.. అందుకు ఆయన నిరాకరించడంతో తన సీఎం పదవికి నీతీశ్‌ రాజీనామా చేశారు. అనంతరం భాజపా మద్దతు తీసుకొని అదే నెలలో మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

నీతీశ్‌ వ్యక్తిగత విశేషాలు.. 

నీతీశ్‌ కుమార్‌ 1951 మార్చి 1న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పరమేశ్వరి దేవి, కవిరాజ్‌ రామ్‌లఖన్‌సింగ్‌. వారు కుర్మి (బీసీ) సామాజిక వర్గానికి చెందినవారు. తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు కావడంతో ఆయన నుంచి నీతీశ్ నైతిక విలువలు అలవర్చుకున్నారు. 1973 ఫిబ్రవరి 22న మంజుకుమారి సిన్హాను వివాహం చేసుకున్నారు. ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. వారిద్దరి ఏకైక సంతానం నిశాంత్‌ కుమార్‌. ఝార్ఖండ్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చదువుకొని ఉద్యోగంలో స్థిరపడ్డారాయన. తండ్రికి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం మాత్రం చేయలేదు. నీతీశ్‌ సతీమణి మంజుకుమారి 2007లో అనారోగ్యంతో మరణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని