కాంగ్రెస్‌లో నాయకత్వ సంక్షోభం లేదు: ఖుర్షీద్‌

కాంగ్రెస్‌ పార్టీలో ఎలాంటి నాయకత్వ సంక్షోభం నెలకొనలేదని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు సల్మాన్‌ ఖుర్షీద్‌ పేర్కొన్నారు. తమ పార్టీ అధినాయకులైన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు ఆల్‌రౌండ్‌ మద్దతు ఉందని ఆయన అన్నారు.

Updated : 22 Nov 2020 20:46 IST

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీలో ఎలాంటి నాయకత్వ సంక్షోభం నెలకొనలేదని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు సల్మాన్‌ ఖుర్షీద్‌ పేర్కొన్నారు. తమ పార్టీ అధినాయకులైన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు పార్టీలో అన్ని వర్గాల మద్దతు ఉందని ఆయన అన్నారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని ఉద్దేశిస్తూ పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు విమర్శలు చేసిన క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సల్మాన్‌ ఖుర్షీద్‌ ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 

ఇటీవల సీనియర్‌ నాయకులు కపిల్‌సిబల్‌, పి చిదంబరం చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా.. ‘పార్టీలో ప్రతిసారి విశ్లేషణలు జరుతాయి. అందులో వారు కూడా భాగస్వాములే. అంతేకాకుండా నాయకులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి పార్టీలో తగినన్ని ఫోరంలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ వాటిని వారు బయట విశ్లేషించడం బాధిస్తోంది. నాయకత్వంపై ఏదైనా అభ్యంతరం అనుకుంటే వారు ముందుకు వచ్చి పార్టీలో అంతర్గతంగా చర్చించాలి.  అంతేకానీ బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. పార్టీలో చర్చించడానికి అంతర్గతంగా ఫోరంలు లేవని భావించే వారు.. ఎంపీలే కదా.. మరి వారు వీధుల్లో చర్చించి ఎంపీలు అయ్యారా?’ అని ప్రశ్నించారు.  

ఏడాది కాలంగా సోనియాగాంధీ మధ్యంతర అధ్యక్షురాలిగా కొనసాగడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని ఆయన కొట్టిపారేశారు. మధ్యంతర అధ్యక్షులు ఏడాది కంటే ఎక్కువ కాలం ఉండొద్దని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. నూతన అధ్యక్ష ఎంపికకు ఎన్నికల కమిటీ పనిచేస్తోంది.. కానీ కొవిడ్‌ కారణంగా కొంత సమయం తీసుకుందని తెలిపారు. ఇప్పటికీ ఆ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. పార్టీలో రాహుల్‌ గాంధీకి మద్దతు ఉందా అని ప్రశ్నించగా.. ‘పార్టీలోని వారంతా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, మాజీ అధ్యక్షులు రాహుల్‌కు తమ పూర్తి మద్దతు ఇస్తున్నారు. చూసేవారికి ఇది స్పష్టంగా తెలుస్తుంది’ అని చెప్పుకొచ్చారు. 

కాగా దేశంలో కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయ పార్టీగా లేదని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు కపిల్‌ సిబల్‌ మీడియా ముందు వెల్లడించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పార్టీలో అంతర్గత విభేదాలను ప్రస్తావిస్తూ.. ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. 

ఇదీ చదవండి..

కాంగ్రెస్‌ ఇక ప్రత్యామ్నాయం కాదు: కపిల్‌ సిబల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని