టీఆర్‌పీ స్కాం: పోలీసులది ప్రతీకారం కాదు: రౌత్‌

టీవీ రేటింగ్‌ పాయింట్స్‌ (టీఆర్‌పీ) కుంభకోణం బయటపెట్టడంలో ముంబయి పోలీసులు ప్రతీకారంతో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల్ని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కొట్టిపారేశారు..........

Published : 10 Oct 2020 02:04 IST

ముంబయి: టీవీ రేటింగ్‌ పాయింట్స్‌ (టీఆర్‌పీ) కుంభకోణం బయటపెట్టడంలో ముంబయి పోలీసులు ప్రతీకారంతో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల్ని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కొట్టిపారేశారు. ఈ కుంభకోణాన్ని బయటకు తేవడంలో సాహసోపేతంగా వ్యవహరించారంటూ పోలీసులను ప్రశంసించారు. ఇది ఆరంభం మాత్రమేనన్న సంజయ్‌ రౌత్‌.. త్వరలోనే అంతా బయటపడుతుందని విలేకర్లతో అన్నారు. ఇది రూ.30వేల కోట్ల కుంభకోణమన్న ఆయన.. దీని వెనుక ఎవరున్నారు? ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? అని ప్రశ్నించారు. ముంబయి పోలీసులు ప్రొఫెషనల్‌గా పనిచేస్తారని, కక్షలు, ప్రతీకార చర్యలకు పాల్పడరన్నారు. మహా వికాస్‌ ఆగాఢీ ప్రభుత్వాన్ని, ఉద్ధవ్‌ ఠాక్రే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొంటూ కొన్ని ఛానళ్లు ప్రవర్తించడం ప్రతీకారం కాదా? అని ప్రశ్నించారు.

టీఆర్‌పీల కోసం మోసాలకు పాల్పడుతున్నట్టు మూడు ఛానళ్లపై ముంబయి పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. రిపబ్లిక్‌ టీవీ సహా రెండు మరాఠా ఛానళ్లు ఈ మోసాలకు పాల్పడినట్టు గుర్తించినట్టు ముంబయి పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌సింగ్‌ నిన్న వెల్లడించారు. అయితే, టీఆర్పీ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల్ని రిపబ్లిక్‌ టీవీ ఖండించింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసులో పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించినందుకే తమపై ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆ ఛానల్‌ చీఫ్‌ అర్నాబ్‌ గోస్వామి ఆరోపణలు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని