‘సభ్యులపై వేటు ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం’

ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటుకు నిరసనగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సస్పెన్షన్‌ను నిరసిస్తూ వేటుకు గురైన ఎంపీలు సభను విడిచి వెళ్లడానికి నిరాకరిస్తున్నారు............

Published : 21 Sep 2020 17:30 IST

రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌పై విపక్షాల నిరసన

దిల్లీ: ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటుకు నిరసనగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సస్పెన్షన్‌ను నిరసిస్తూ వేటుకు గురైన ఎంపీలు సభను విడిచి వెళ్లడానికి నిరాకరించారు. సభ వాయిదా పడ్డా.. అక్కడే కూర్చొని నిరసన తెలిపారు. ఛైర్మన్‌ నిర్ణయంపై విపక్ష పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. సభ్యుల సస్పెన్షన్‌ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం పోరాడుతున్న ఎంపీలపై వేటు వేయడం ఏమాత్రం సరైన చర్య కాదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని పూర్తిగా అగౌరవపరుస్తోందన్నారు. ప్రభుత్వ ఒత్తిడికి ఏమాత్రం తలొంచేది లేదని.. సర్కార్‌ నిరంకుశత్వాన్ని అటు పార్లమెంటులో ఇటు వీధుల్లో దీటుగా ఎదుర్కొంటామన్నారు. 

మరో టీఎంసీ నేత, ఎంపీ అభిషేక్‌ బెనర్జీ మాట్లాడుతూ.. సభ్యుల సస్పెన్షన్‌ పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. వ్యవసాయం రంగ బిల్లుల్ని తొలుత ఆర్డినెన్స్‌ల రూపంలో తెచ్చి ప్రాథమిక సూత్రాల్ని ఉల్లంఘించిన ప్రభుత్వం తాజాగా వాటిపై సభలో ఓటు వేసే హక్కును కూడా కాలరాసిందని ఆరోపించారు. ఇవన్నీ చూస్తే భాజపా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

మరోవైపు వ్యవసాయ రంగ బిల్లులకు వ్యతిరేకంగా హరియాణా, పంజాబ్‌ సహా దేశంలో వివిధ ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. దీన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రైతుల్లో కనీస మద్దతు ధరపై నెలకొన్న సందేహాల్ని తొలగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో విశ్వాసం నింపేలా మద్దతు ధరల్ని పెంచేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు నేడు క్యాబినెట్‌ భేటీలో దీనిపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి..

రాజ్యసభలో 8 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని