భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భాజపా నేతల ప్రతిజ్ఞ

పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆమ్మవారిని శుక్రవారం ఉదయం తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ దర్శించుకున్నారు.

Published : 19 Dec 2020 00:53 IST


హైదరాబాద్‌: పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆమ్మవారిని శుక్రవారం ఉదయం తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ దర్శించుకున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్లతో కలిసి ఆలయానికి వెళ్లిన ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని, భాజపా సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తామని నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, పలువురు భాజపా నేతలు పాల్గొన్నారు. భాజపా నేతల పర్యటన సందర్భంగా చార్మినార్‌ వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ..భాగ్యలక్ష్మి అమ్మవారి దయతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా మంచి ఫలితాలు సాధించిందన్నారు. జీహెచ్‌ఎంసీలోలో అభివృద్ధి పనులకు తమ పార్టీ సహకరిస్తుందని స్పష్టం చేశారు. సీఎం వైఖరి వల్లే హైదరాబాద్‌లో అభివృద్ధి జరగటం లేదన్నారు. భాజపాకు మేయర్‌ పీఠం దక్కనప్పటికీ హైదరాబాద్‌ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఒక వర్గం కోసం మెజార్టీ ప్రజలను అధికార పార్టీ అవమానిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌ను ఎంఐఎం నుంచి విముక్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. పాతబస్తీలో ఎందుకు అభివృద్ధి జరగటంలేదో ప్రజలు ఆలోచించుకోవాలని బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని