‘ఇలా అయితే మేం రాష్ట్రాల్ని ఎలా పాలించాలి’

కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లో నిరసనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. ఈ బిల్లుల ఆమోదంపై పంజాబ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుందని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ వెల్లడించారు.

Published : 29 Sep 2020 01:26 IST

ఛండీగఢ్‌: కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లో నిరసనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. ఈ బిల్లుల ఆమోదంపై పంజాబ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుందని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని ఆయన ఆరోపించారు. పంజాబ్‌లోని కట్కర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్‌ రావత్‌, పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ సునీల్‌ జఖడ్‌తో కలిసి స్వాతంత్ర్యయోధుడు భగత్‌సింగ్‌కు ఆయన నివాళులర్పించారు. అనంతరం వ్యవసాయ బిల్లుల ఆమోదానికి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం తన చేతిలోకి తీసుకుంటే తామెలా రాష్ట్రాల్ని నడపాలని ప్రశ్నించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులు రైతు సమాజాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శలు చేశారు.  బిల్లులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదిస్తూ సంతకం చేశారు.  వాటికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎల్లప్పుడు రైతుల సంక్షేమం కోసమే పోరాడుతుందని చెప్పారు. రేపు దిల్లీ నుంచి పంజాబ్‌కు న్యాయవాదులను రప్పించి వారితో చర్చించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకుందామని నిరసనకారులను ఉద్దేశించి అన్నారు. పార్లమెంటులో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులపై ఆదివారం రాష్ట్రపతి  సంతకం చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రత్యేకంగా పంజాబ్‌ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు జోరందుకున్నాయి. కాగా దిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద కొందరు వ్యక్తులు ఈ రోజు వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ ట్రాక్టర్‌ను దగ్దం చేశారు. మరోవైపు కర్ణాటకలోనూ రైతు సంఘాలు నేడు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని