దుబ్బాకలో అప్పుడలా..ఇప్పుడిలా!

టీ20 ఉత్కంఠభరిత మ్యాచ్‌ను తలపించిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం వచ్చేసింది. ఆఖరి రౌండ్‌ దాకా నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా సాగిన ఈ రసవత్తర పోరులో చివరకు భాజపా అభ్యర్థి రఘునందన్‌దే పైచేయి అయింది..........

Updated : 10 Nov 2020 17:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ఉత్కంఠభరిత మ్యాచ్‌ను తలపించిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం వచ్చేసింది. ఆఖరి రౌండ్‌ దాకా నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా సాగిన ఈ రసవత్తర పోరులో చివరకు భాజపా అభ్యర్థి రఘునందన్‌దే పైచేయి అయింది. 1470 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఆయన దుబ్బాకను సొంతం చేసుకొని చారిత్రక విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 62వేల మెజార్టీతో భారీ విజయం సాధించిన తెరాసకు ఈసారి ఊహించని స్థాయిలో షాక్‌ తగిలింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన సతీమణి సుజాతను తెరాస బరిలోకి దింపినా సెంటిమెంట్‌ పనిచేయలేదు. కాంగ్రెస్‌ అభ్యర్థి కూడా అంతంత మాత్రమే ప్రభావం చూపగలిగారు.

పకడ్బందీ పోల్‌మేనేజ్‌మెంట్‌..
రఘునందన్‌ రావు 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో భాజపా తరఫున పోటీచేసినా ఓటమినే చవిచూశారు. 2018లో ఆయనకు 26,799 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ స్థానం నుంచి కూడా బరిలో దిగినా అప్పుడూ ఓటమిపాలయ్యారు. అయితే, ఈ రెండేళ్ల వ్యవధిలోనే ఆయన ఇంతగా పుంజుకొని రికార్డు విజయం సాధించడం వెనుక భాజపా పకడ్బందీ పోల్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు.. యువతను ఆకట్టుకోగలగడం కీలకాంశాలు. ఈ ఉప ఎన్నికల్లో రఘునందన్‌కు 62,772 ఓట్లు రాగా.. తెరాస అభ్యర్థి సుజాతకు 61,302 ఓట్లు వచ్చాయి. దుబ్బాకలో తమకు ఎదురులేదని ధీమాతో ఉన్న తెరాసకు ఊహించని రీతిలో పోటీనిచ్చి అందరి దృష్టినీ రఘునందన్‌ ఆకర్షించారు. తొలి రౌండ్లలో భాజపా స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ వచ్చినప్పటికీ.. ఆఖరి రౌండ్లలో ఆధిక్యం దోబూచులాడటంతో తెరాస-భాజపా అభ్యర్థుల మధ్య పోరు మరింత ఉత్కంఠ రేపింది. గతంలో దుబ్బాకలో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి తెరాసకు గట్టి పోటీ ఇవ్వడంలో కమలనాథుల పదునైన వ్యూహం, దూకుడు బాగా పనిచేశాయి. 

ఇదీ చదవండి..

దుబ్బాకలో భాజపా జయకేతనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని