కొడాలి నాని వ్యాఖ్యలు హేయం: రఘురామ

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మంత్రి కొడాలి నాని మాట్లాడటం హేయమని ఎంపీ రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు. పరమత సహనాన్ని కాపాడాలని...

Updated : 21 Sep 2020 15:31 IST

దిల్లీ: హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మంత్రి కొడాలి నాని మాట్లాడటం హేయమని ఎంపీ రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు. పరమత సహనాన్ని కాపాడాలని సూచించారు. అనవసరంగా గొడవలకు దారితీయొద్దని హితవు పలికారు. తనను వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలంతా లక్ష్యంగా చేసుకున్నారని, వారంతా ఆత్మావలోకనం చేసుకోవాలని సూచించారు. దేవాలయాలపై జరిగిన దాడులను హిందువులకు తగిలిన గాయాలుగా రఘురామ అభివర్ణించారు. ‘‘ హిందువుల మనోభావాలను ప్రతిఒక్కరు కాపాడాలి. హిందువుల మనోభావాలకు ఇబ్బంది కలిగేలా కేబినెట్ మంత్రులు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రితో ఇలాంటి వ్యాఖ్యలు చేయించడం మంచిది కాదు. హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దు’’ అని రఘురామ కృష్ణరాజు అన్నారు. 

తిరుమల వెంకటేశ్వరస్వామి డబ్బుపై వైకాపా నేతలు కన్నేశారని అందరూ అనుకుంటున్నట్లు రఘురామ చెప్పారు. ‘‘తితిదేలో ఇద్దరు అధికారులను మార్చాల్సిన అవసరం ఎందుకొచ్చింది. హిందువులకు పవిత్రమైన దేవాలయం తితిదే ఎలాగో, ముస్లింలకు కూడా మక్కా అలాంటింది. రథం తగలబెడితే జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి సొమ్ములు ఇవ్వడం లేదు కదా? ప్రజల డబ్బులే కదా. మా మతం జోలికి రాకండి. మా మతాన్ని కాపాడే వారు ఉన్నారు. హిందువులు అన్నీ చూస్తున్నారు. దేవుడి సొమ్ము కొట్టేసినవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు’’ అని తీవ్రంగా విమర్శించారు. అమరావతి అంశంపై న్యాయ సలహాలు తీసుకున్న తర్వాతే మాట్లాడానని రఘురామ కృష్ణరాజు అన్నారు. అమరావతి 20 గ్రామాల సమస్య కాదని, ఇది రాష్ట్ర సమస్య అని ఆయన అన్నారు. జీఎస్టీ, రాష్ట్రానికి బకాయిలు కాకుండా ఇతర అంశాలపై వైకాపా ఎంపీలు పోరాటం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాన్రానూ జగన్‌మోహన్‌రెడ్డి తన స్థాయిని తగ్గించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని