దేశంలో నడిచే అవకాశం కూడా లేదా?: రాహుల్‌

కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంక గాంధీ హాథ్రస్‌ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. యూపీలోని హాథ్రస్‌ ఘటనలో మృతిచెందిన యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న నేతలను యమునా ఎక్స్‌ప్రెస్‌ వే వద్ద పోలీసులు.........

Updated : 01 Oct 2020 16:17 IST

తోపులాటలో కిందపడిపోయిన రాహుల్‌

లఖ్‌నవూ: కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంక గాంధీ హాథ్రస్‌ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. యూపీలోని హాథ్రస్‌ ఘటనలో మృతిచెందిన యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న నేతలను యమునా ఎక్స్‌ప్రెస్‌ వే వద్ద పోలీసులు అడ్డుకున్న పోలీసులు రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతకముందు గ్రేటర్‌ నోయిడా వద్ద వారి వాహనాలను అడ్డుకోవడంతో.. నేతలిద్దరూ దిగి కాలినడకన బయల్దేరారు. ఈ క్రమంలో పోలీసులు, రాహుల్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో రాహుల్‌ గాంధీ కిందపడిపోయారు. పోలీసుల తీరుపై రాహుల్‌, ప్రియాంక తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు తనను పక్కకు తోసి లాఠీఛార్జి చేశారంటూ రాహుల్‌ ఆరోపించారు. ఏ చట్టం ప్రకారం అడ్డుకుంటున్నారో చెప్పాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. ఈ దేశంలో నడిచేందుకు కూడా అవకాశం లేదా? అని ప్రశ్నించారు. కేవలం ఆరెస్సెస్‌, భాజపా నేతలు మాత్రమే రోడ్డుపై నడవాలా? అని నిలదీశారు. తొలుత రాహుల్‌ హాథ్రస్‌ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు సెక్షన్‌ 188 కింద అరెస్టు చేస్తున్నట్టు ఆయనకు చెప్పారు. ఎపిడమిక్‌ చట్టం ఉల్లంఘనకు పాల్పడ్డారని, అందుకే అడ్డుకున్నట్టు నోయిడా ఏసీపీ తెలిపారు. ఆయన్ను ముందుకు వెళ్లనీయబోమన్నారు. దీనిపై స్పందించిన రాహుల్‌.. తానొక్కడినే నడిచి వెళ్తానని, అడ్డుకోవద్దని చెప్పినా పోలీసులు వినలేదన్నారు. అయితే, పోలీసులు రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

ప్రభుత్వం మొద్దునిద్ర వీడే దాకా పోరాటం: ప్రియాంక

ఉన్నావ్‌ ఘటనలాగే హాథ్రస్‌ బాధితురాలి తరఫున పోరాటం చేస్తామని ప్రియాంక గాంధీ అన్నారు. యూపీలో మహిళలపై అకృత్యాలు ఆగడంలేదన్నారు. వీటికి అడ్డుకట్ట వేసే బాధ్యతను యూపీ సీఎం తీసుకోవాలన్నారు. యువతి అంత్యక్రియల విషయంలో పోలీసులు అనుసరించిన తీరుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. మహిళల రక్షణలో యోగి సర్కార్‌ మొద్దు నిద్రవీడే దాకా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. హథ్రాస్‌ ఘటన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి

రాహుల్‌, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని