అప్పుడు రాహుల్‌ గాంధీ పిక్నిక్‌కు వెళ్లారు..

70 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్‌.. కనీసం 70 ప్రచార సభలు కూడా నిర్వహించలేదు.

Published : 16 Nov 2020 11:01 IST

అపజయం నేపథ్యంలో ఆర్జీడీ సీనియర్‌ నేత ఆరోపణ

పట్నా: బిహార్‌ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని మహాకూటమి 110 స్థానాలు గెలిచినప్పటికీ అధికారం లభించలేదు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తారుమారు చేస్తూ 125 స్థానాలను కైవశం చేసుకున్న ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో పొత్తు విజయావకాశాలను దెబ్బదీసిందని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ మేరకు ఆర్జీడీ సీనియర్‌ నేత శివానంద్‌ తివారీ చేసిన విమర్శతో ఈ అసంతృప్తి మరింత స్పష్టమయింది.

‘‘70 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్‌.. కనీసం 70 ప్రచార సభలు కూడా నిర్వహించలేదు. ఎన్నికల నేపథ్యంలో రాహుల్‌ గాంధీ కేవలం మూడు రోజుల పాటు బిహార్‌కు వచ్చారు. ప్రియాంకా గాంధీ వాద్రా అయితే అసలు రానేలేదు. దేశమంతా బిహార్‌ ఎన్నికల వైపు దృష్టి కేంద్రీకరించిన సమయంలో.. రాహుల్‌ తన సోదరి ప్రియాంక ఇంట్లో పిక్నిక్‌ చేసుకున్నారు. బిహార్‌కు ఏ మాత్రం పరిచయం లేనివారు ఇక్కడ ప్రచారం చేసేందుకు వచ్చారు. పార్టీని నడిపే తీరు ఇదేనా? ఇది సరి కాదు’’ అని ఆర్జేడీ జాతీయ ఉపాధ్యక్షుడు శివానంద్‌ తివారీ విమర్శించారు.

అధిక స్థానాల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపే కాంగ్రెస్‌.. ఆ సీట్లను గెలుచుకునేందుకు కృషి చేయదన్నారు. బిహార్‌కే కాకుండా ఇత రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ ఇదే వైఖరి ప్రదర్శిస్తుందని శివానంద్‌ విమర్శించారు. దీనిని గురించి ఆ పార్టీ పునరాలోచన చేయాలని ఈ మాజీ మంత్రి హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని