ప్రపంచంలో ఏ శక్తీ నన్ను అడ్డుకోలేదు: రాహుల్‌

దుఃఖంలో మునిగిఉన్న ఆ కుటుంబానికి ఓదార్పు అందించకుండా ప్రపంచంలో ఏశక్తీ తమను అడ్డుకోలేదని రాహుల్‌ తాజాగా ప్రకటించారు.

Published : 03 Oct 2020 11:21 IST

దిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు ఈ రోజు మధ్యాహ్నం హాథ్రస్‌ బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు వెళ్లనున్నట్టు ఆ పార్టీ‌ ప్రకటించింది. దుఃఖంలో మునిగి ఉన్న ఆ కుటుంబానికి ఓదార్పు అందించకుండా ప్రపంచంలో ఏశక్తీ తమను అడ్డుకోలేదని రాహుల్‌ తాజాగా స్పష్టం చేశారు. అంతేకాకుండా ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వ అధికార దుర్వినియోగం, అసమర్థతలకు నిరసనగా తాము అక్టోబర్‌ 5న దేశవ్యాప్తంగా  సత్యాగ్రహాన్ని చేపట్టనున్నట్టు కాంగ్రెస్‌ ప్రకటించింది.

గురువారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలను  పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అక్కడ వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ కింద పడిపోయారు. పోలీసులు తనను పక్కకు తోసి లాఠీఛార్జి చేశారంటూ రాహుల్‌ ఆరోపించారు.  తమను ఏ చట్టం ప్రకారం అడ్డుకుంటున్నారో వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ దేశంలో భాజపా, ఆరెస్సెస్‌ నేతలకు తప్ప మిగిలిన వారికి రహదారిపై నడిచే  అవకాశం కూడా లేదా? అని కాంగ్రెస్‌ నేత ప్రశ్నించారు. యోగి ఆదిత్యనాథ్‌కు రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదని.. అయన రాజీనామా చేయాలని ప్రియాంకా గాంధీ డిమాండ్‌ చేశారు.

హాథ్రస్‌ బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళుతున్న రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా తదితర కాంగ్రెస్‌ నేతల పట్ల.. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వ వైఖరి అనుచితమని కాంగ్రెస్‌ మండిపడింది. ఈ సత్యాగ్రహంలో పార్టీ ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులతో సహా అందరూ పాల్గొని ముందుకు నడిపించాలని పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ అన్ని రాష్ట్ర, జిల్లా కార్యాలయాలకు ప్రకటనలు జారీచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని