వారి ఆందోళన అర్థంచేసుకోండి: రాహుల్‌

సెప్టెంబర్‌ 1 నుంచి జేఈఈ -మెయిన్స్‌, నీట్‌ పరీక్షలు నిర్వహిస్తామని కేంద్రం తేల్చి చెప్పడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అన్నారు........

Published : 27 Aug 2020 00:39 IST

దిల్లీ: సెప్టెంబర్‌ 1 నుంచి జేఈఈ -మెయిన్స్‌, నీట్‌ పరీక్షలు నిర్వహిస్తామని కేంద్రం తేల్చి చెప్పడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అన్నారు. విద్యార్థుల చెప్పేదేంటో ప్రభుత్వం విని ఆమోదయోగ్యమైన పరిష్కారం దిశగా ఆలోచించాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కరోనా భయం వెంటాడుతున్న సమయంలో పరీక్షలు నిర్వహిస్తుండటంతో విద్యార్థులంతా తమ ఆరోగ్యం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారని రాహుల్‌ పేర్కొన్నారు. కరోనా ఇన్ఫెక్షన్‌, రవాణా, వసతులు, అసోం, బిహార్‌లో వరదలతో నెలకొన్న కల్లోల పరిస్థితుల్లో విద్యార్థులు ఆందోళన చెందడంలో న్యాయం ఉందని పేర్కొన్నారు. 

దిల్లీలోని శాస్త్రి భవన్‌ వద్ద యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కరోనాతో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో నీట్‌, జేఈఈ మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు.

మరోవైపు నీట్‌, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ పలు రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు చేస్తున్న విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తామని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ.. భాజపాయేతర పాలిత రాష్ట్రాలకు చెందిన ఏడుగురు సీఎంలతో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. జీఎస్టీ పరిహారం, పరీక్షల వాయిదా అంశంపై చర్చించారు. పరీక్షల నిర్వహణ విషయంలో కేంద్రం లెక్కలేనట్టు వ్యవహరిస్తోందని సోనియా మండిపడ్డారు. అయితే, కేంద్రం ఈ పరీక్షలను వాయిదా వేయకపోతే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏడుగురు సీఎంలు యోచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని