పేదవారి బాధేంటో తెలుస్తోందా: రాహుల్

దేశంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ అన్నారు....

Published : 11 Aug 2020 19:39 IST

దిల్లీ: దేశంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ అన్నారు. అలానే పట్టణాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం తమ పార్టీ సూచించిన కనీస ఆదాయ హామీ పథకం (ఎన్‌వైఏవై) కూడా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీటి అమలుతో ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని రాహుల్‌ అభిప్రాయపడ్డారు.

కరోనా కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని అధిమించడంతో పాటు, పెరుగుతున్న పని భారాన్ని తగ్గించేందుకు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్‌ గత కొంత కాలంగా ప్రభుత్వాన్ని కోరుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్ గాంధీ మరోమారు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్‌ ఖాతాలో ఉపాధి హామీ పథకానికి ఉన్న డిమాండ్‌కు సంబంధించిన గ్రాఫ్‌ను షేర్‌ చేశారు. ‘‘ పట్టణాల్లో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకం అమలు ఎంతైనా అవసరం. అలానే దేశవ్యాప్తంగా ఉన్న పేదవారి కోసం ఎన్‌వైఏవై కూడా అమలు చేయాలి. ఇది ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో మేలు చేస్తుంది. కానీ పేదవారి బాధలను ఈ సూటు బూటు ప్రభుత్వం అర్థం చేసుకుంటుందా’’ అని ట్వీట్ చేశారు. దేశంలో కరోనా మొదలైన నాటి నుంచి పేదవారిని ఆదుకునేందుకు జన్‌ధన్‌ ఖాతాలతోపాటు, అన్ని రకాల పెన్షన్‌దారులు, పీఎం కిసాన్‌ ఖాతాల్లో రూ. 7,500 జమ చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని