కలత చెందడం సహజమే కదా..!:గహ్లోత్‌

పార్టీ నాయకత్వంతో మంతనాల అనంతరం సచిన్‌ పైలట్‌ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలిసి ముఖ్యమంత్రి వర్గం ఎమ్మెల్యేలు తీవ్రఅసంతృప్తి చెందినట్లు సమాచారం.

Published : 12 Aug 2020 15:10 IST

ముఖ్యమంత్రి వర్గం ఎమ్మెల్యేల నిరాశ

జైపుర్‌: నెలరోజుల ప్రతిష్టంభన అనంతరం రాజస్థాన్‌ రాజకీయ సంక్షోభానికి తెరపడిన విషయం తెలిసిందే. ఈ నెలరోజుల నుంచి ముఖ్యమంత్రి వర్గం ఎమ్మెల్యేలు జైపుర్‌లోని హోటల్‌లోనే మకాం వేశారు. పార్టీ నాయకత్వంతో మంతనాల అనంతరం సచిన్‌ పైలట్‌ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలిసి ముఖ్యమంత్రి వర్గం ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి చెందినట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చిన సమాచారంతో ముఖ్యమంత్రి.. ఎమ్మెల్యేలను కలిసేందుకు హోటల్‌కు వెళ్లిన సందర్భంలో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

దీనిపై ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ స్పందిస్తూ.. ‘నెలరోజుల సుదీర్ఘ సమయంపాటు ఎమ్మెల్యేలు హోటల్‌లోనే ఉన్నారు. ఈ సమయంలో ఎపిసోడ్‌కు ముగింపు పలికిన తీరుపై ఎమ్మెల్యేలు కలత చెందడం సహజమేకదా’ అని విలేకరులతో వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలతో తీవ్ర నిరాశలోఉన్న ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి బుజ్జగించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంతోపాటు ప్రజలకు సేవ చేయడంలో భాగంగా ఒక్కోసారి సహనంతో మెలగాల్సి ఉంటుందని ఎమ్మెల్యేలతో అన్నారు. పార్టీలోకి తిరిగివస్తున్న ఎమ్మెల్యేలను క్షమిస్తూ, జరిగిన ఘటనను మరచిపోయి ముందుకు సాగాలని సూచించారు.

ఇదిలాఉంటే, పార్టీ నాయకత్వం హామీతో రెబల్‌ నేత సచిన్‌ పైలట్‌ జైపుర్‌ చేరుకున్నారు. తాను లేవనెత్తిన అంశాలను పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ పరిష్కరిస్తుందనే నమ్మకం ఉందన్నారు. అయితే పార్టీలో తనకు ఎలాంటి పదవులు కావాలనే విషయాలపై డిమాండ్‌ చేయలేదని సచిన్‌ స్పష్టం చేశారు. కేవలం తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలపై ఎటువంటి ప్రతీకారచర్యలు తీసుకోవద్దని మాత్రమే కోరినట్లు సచిన్‌  వెల్లడించారు.

ఇవీ చదవండి..
ఆ వ్యాఖ్యలు నన్ను బాధించాయి: సచిన్‌ పైలట్‌
కాంగ్రెస్‌లోనే సచిన్‌ పైలట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని