రాజస్థాన్‌: మూడోసారీ ముఖ్యమంత్రికి చుక్కెదురు!

రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తాజాగా ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌కు గవర్నర్‌ కార్యాలయం నుంచి మళ్లీ చుక్కెదురైంది. జులై 31న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మూడోసారి అందిన ప్రతిపాదనలను గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా మళ్లీ తిరస్కరించారు.

Published : 30 Jul 2020 02:57 IST

జైపుర్‌: రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తాజాగా ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌కు గవర్నర్‌ కార్యాలయం నుంచి మళ్లీ చుక్కెదురైంది. జులై 31న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మూడోసారి అందిన ప్రతిపాదనలను గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా మళ్లీ తిరస్కరించారు. దీంతో గవర్నర్‌ను మరోసారి కలవడానికి ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సిద్ధమయ్యారు. తిరస్కరణకు గల కారణాలను నేరుగా గవర్నర్‌నే అడిగి తెలుసుకుంటానని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. గవర్నర్‌ను కలవడానికి వెళ్ళే సమయంలో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. రాజస్థాన్‌ రాజకీయాల్లో సంక్షోభం ఏర్పడ్డప్పటి నుంచి ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలవడం ఇది నాలుగోసారి కావడం విశేషం. 

అసెంబ్లీ సమావేశాలను ఎలాగైనా నిర్వహించాలని పలువ్యూహాలతో ముందుకెళ్తున్నప్పటికీ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌కు అడ్డంకులు వస్తూనేఉన్నాయి. అసెంబ్లీ నిర్వహించేందుకు సరైన సమయం, కారణం లేదంటూ ముఖ్యమంత్రి ప్రతిపాదనను ఇప్పటికే రెండుసార్లు తిరస్కరించారు. అయితే, బలనిరూపణ అంశం లేకుండా కేవలం రాష్ట్రంలో నెలకొన్న కొవిడ్‌ పరిస్థితులు, ఇతర బిల్లులపై చర్చకే అసెంబ్లీ నిర్వహించాలని కేబినెట్ తాజాగా‌ ప్రతిపాదించింది. మూడోసారి పంపిన ఈ ప్రతిపాదనను కూడా గవర్నర్‌ మిశ్ర తిరస్కరించారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయనే ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ,రెండోసారి ప్రతిపాదనను గవర్నర్‌ తిప్పిపంపిన సమయంలో ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన‌ తిప్పిపంపిన ఉత్తరాన్ని ప్రేమ పత్రంగా అభివర్ణించారు. రెండోసారి కూడా గవర్నర్‌ ప్రేమ పత్రాన్ని తిరస్కరించారంటూ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం.

చరిత్రలో తొలిసారి..: కాంగ్రెస్‌
రాజస్థాన్‌లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ స్పందించారు. ఓ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు గవర్నర్‌ విముఖత చూపడం చరిత్రలో ఇదే తొలిసారి అని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిణామాలు చాలా ప్రమాదకరమైనవని అహ్మద్‌ పటేల్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని