రాజ్యసభ నిరవధిక వాయిదా

రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది.  తొలుత నిర్ణయించిన ప్రకారం అక్టోబరు 1వ తేదీ వరకూ ఈ సమావేశాలు కొనసాగాల్సి ఉన్నప్పటికీ ఎనిమిది రోజుల ముందుగానే ముగించారు. సభ్యుల్లో కొందరికి కరోనా వైరస్‌ సోకడంతో...........

Updated : 23 Sep 2020 15:13 IST

సాయంత్రం రాష్ట్రపతిని కలవాలని విపక్షాల నిర్ణయం!

దిల్లీ: రాజ్యసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం అక్టోబరు 1వ తేదీ వరకూ ఈ సమావేశాలు కొనసాగాల్సి ఉన్నప్పటికీ ఎనిమిది రోజుల ముందుగానే ముగించారు. సభ్యుల్లో కొందరికి కరోనా వైరస్‌ సోకడంతో సభా సమావేశాల్ని కుదిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. బుధవారం రాజ్యసభలో పలు కీలక బిల్లులను ఆమోదించారు. జమ్మూకశ్మీర్‌ అధికార భాషల బిల్లుతో పాటు మూడు కార్మిక బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ మూడు కార్మిక బిల్లులలో ద ఆక్యుపేషనల్‌ సేఫ్టీ, హెల్త్‌ అండ్‌ వర్కింగ్‌ కండిషన్స్‌ కోడ్‌ -2020, ద ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌ కోడ్‌ -2020, ద కోడ్‌ ఆన్‌ సోషల్‌ సెక్యూరిటీ -2020 బిల్లులు ఉన్నాయి.  

25 బిల్లులకు ఆమోదం

ఈ నెల 14 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, ఈ సమావేశాలు 18 రోజుల పాటు జరగాల్సి ఉన్నప్పటికీ 10 రోజులే జరిగాయని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు అన్నారు. ఈ పది రోజుల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో 25 బిల్లులు ఆమోదం లభించగా.. ఆరు బిల్లులను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఈ సమావేశాల ఉత్పాదకత 100.47శాతంగా ఉందని తెలిపారు. 198 మంది ఎంపీలు రాజ్యసభలో చర్చల్లో పాల్గొన్నారని, 1567 అన్‌స్టార్‌డ్‌ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్టు వెంకయ్య‌ వెల్లడించారు. 

పార్లమెంట్‌ ఆవరణలో విపక్ష ఎంపీల నిరసన

వ్యవసాయ బిల్లుల ఆమోదం నేపథ్యంలో పెద్దల సభలో ఆదివారం చోటుచేసుకున్న గందరగోళానికి కారణమైన ఎనిమిది మంది ఎంపీలపై సస్పెన్షన్‌ విధించడాన్ని నిరసిస్తూ ఉభయ సభల సమావేశాలను కాంగ్రెస్‌ సహా పలు విపక్ష పార్టీలు బహిష్కరించి ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.  మరోవైపు,  రాజ్యసభలో  ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ కార్యాలయంలో విపక్ష ఎంపీలు  సమావేశమమయ్యారు. వ్యవసాయ బిల్లులు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన నేపథ్యంలో చేపట్టాల్ని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అంతకుముందు కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయెన్‌, ఎన్సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌ తదితరులు పార్లమెంట్‌ ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘రైతులను రక్షించండి, కార్మికులను కాపాడండి.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. వ్యవసాయ బిల్లుల అంశంపై ఈ సాయంత్రం 5గంటలకు రాష్ట్రపతిని కలవాలని విపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని