‘మీ పాలన గురించి కోర్టు తీర్పులే చెబుతున్నాయి’

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్‌ ఆఘాడీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్త చేసుకుంది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.......

Published : 28 Nov 2020 20:48 IST

ఉద్ధవ్‌ ఠాక్రేపై భాజపా నేత ఫడణవీస్‌ తీవ్ర విమర్శలు

 

ముంబయి: మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని ‘మహా వికాస్‌ ఆఘాడీ’ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రతిపక్ష భాజపా తన కుటుంబంపై విమర్శలు చేస్తోందని సీఎం ఠాక్రే శుక్రవారం ఆరోపించారు. కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడితే వదిలేది లేదని హెచ్చరించారు. దీనికి భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ కౌంటర్‌ ఇస్తూ.. బెదిరింపులు మానేసి పరిపాలనపై దృష్టి సారించాలని ఠాక్రేకు హితవు పలికారు. 

ఉద్ధవ్‌ ఠాక్రే ఏడాది పాలన ఎలా ఉందో ఇటీవల వెలువడిన రెండు కోర్టు తీర్పులే చెబుతున్నాయని ఫడణవీస్‌ ఎద్దేవా చేశారు. పరోక్షంగా నటి కంగనా రనౌత్‌, జర్నలిస్టు అర్నబ్‌ గోస్వామి కేసుల్లో కోర్టు వెలువరించిన తీర్పుల్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అర్నబ్‌ గోస్వామి, కంగనా రనౌత్ భావాలను మేం సమర్థించడం లేదు. కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని అణచివేయడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని ఫడణవీస్‌ పేర్కొన్నారు. తామెప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదని.. అలా చేయాలనుకుంటే గత నెల తన సతీమణిపై దాడి చేసినప్పుడే స్పందించేవాళ్లమని చెప్పుకొచ్చారు. పరోక్షంగా ఫడణవీస్‌ భార్య అమృత ఫడణవీస్‌.. శివసేన మహిళా నేత ప్రియాంక చతుర్వేది మధ్య జరిగిన ట్వీట్ల యుద్ధాన్ని ప్రస్తావించారు. శివసేనకు సీఎం పీఠంపై భాజపా ఇచ్చిన హామీ గుర్తుంది కానీ, రైతులకు వారిచ్చిన హామీలు మాత్రం గుర్తుకులేదని ఫడణవీస్‌ విమర్శించారు. సీఎం పదవిలో ఉండి బెదిరింపులకు పాల్పడడం తగదని ఠాక్రేకు హితవు పలికారు. 

నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య కేసులో భాజపా తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను లక్ష్యంగా చేసుకుందని ఉద్ధవ్‌ ఠాక్రే శుక్రవారం ఆరోపించారు. ‘‘మీరు నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి.. మీకూ కుటుంబాలు, పిల్లలు ఉన్నారు. మీరేం సచ్ఛీలురు కాదు. మిమ్మల్ని ఎలా మార్చాలో మాకూ తెలుసు’’ అంటూ ఠాక్రే పరోక్షంగా భాజపా నాయకుల్ని ఉద్దేశిస్తూ హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని